నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఆగస్టు 17 : కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై లైంగికదాడి, హత్య చేయడంపై జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకేంద్రంతోపాటు వివిధ మండలాలు, గ్రామాల్లో శనివారం నిరసనలు చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని దవాఖానల్లో 24 గంటలపాటు ఓపీ సేవలను నిలిపివేశారు. జిల్లాకేంద్రంలో డీఎంహెచ్‌వో రాజశ్రీ, వైద్యులు, సిబ్బందితో ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
మోస్రా పీహెచ్సీ వద్ద వైద్యుడు విజయ్ కుమార్, సిబ్బంది నిరసన తెలిపారు. కోటగిరి సీహెచ్‌సీ వద్ద డాక్టర్ సుప్రియ, ఆరోగ్య శాఖ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జిల్లాకేంద్రంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో నిరసన తెలిపారు. డిచ్పల్లిలోని సీహెచ్‌సీ, ధర్పల్లి ప్రభుత్వ దవాఖాన, ఇందల్వాయి పీహెచ్సీ, రుద్రూర్ పీహెచ్‌సీల వద్ద వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, సిబ్బంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఉదయం నుంచి ఓపీ సేవలు అందించిన అనంతరం మధ్యాహ్నం ఇన్చార్జి సూపరింటెండెంట్ సుమంత్, ఆర్ఎంవో రాహుల్‌తోపాటు పలువురు వైద్యులు, సిబ్బంది ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. బోధన్ పీఎంపీల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలోని ప్రైవేట్ దవాఖానల్లో ఓపీ సేవలు నిలిపివేశారు. ఆర్మూర్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన్లో ట్రైనీ డాక్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైద్యులు మౌనం పాటించారు.
నందిపేట్ ప్రాథమిక వైద్యులతో పాటు సిబ్బంది నిరసనతెలిపారు. నవీపేట కమ్యూనిటీ ఎల్త్ సెంటర్లో డాక్టర్ కావ్య అధ్వర్యంలో సిబ్బంది నిరసన తెలిపారు. ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ ఫిర్దోజ, ఆయుష్మాన్ మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది నిరసన చేపట్టారు.
ఖలీల్‌వాడి, ఆగస్టు 17 : ఐఎంఏ, తానా వైద్యులు ఓపీ సేవలు నిలిపివేసి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గంగస్థాన్‌లోని ఐఎంఏ భవనంలో శనివారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హాజరై మాట్లాడారు. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డాక్టర్ మౌమిత ఆత్మకు శాంతి చేకూరాలని నగరంలోని ప్రముఖ వైద్యులు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు.