వినాయక్‌నగర్, నవంబర్ 13 : కోర్టుల ద్వారా సత్వర న్యాయాన్ని ఆశిస్తున్న న్యాయార్థుల ఆశలకు అనుగుణంగా మరింత కష్టపడి పనిచేద్దామని జిల్లా జడ్జి సునీత కుంచాల పిలుపునిచ్చారు. ప్రజలు అన్ని రాజ్యాంగ వ్యవస్థల కన్నా ఎక్కువగా న్యాయవ్యవస్థపైనే ఆధారపడతారని, ఆ నమ్మకాన్ని ద్విగిణీకృతం చేద్దామని సూచించారు. బార్ అండ్ బెంచ్ సమన్వయంతో కక్షిదారులకు మెరుగైన న్యాయ సేవలు అందిస్తున్నామని, న్యాయమూర్తులు, న్యాయవాదులు మరింత శ్రమిస్తే మరిన్ని న్యాయ ఫలాలు అందించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించిన న్యాయవాదులతో మాట్లాడారు.
న్యాయవ్యవస్థ పనితీరులో ఎంతో పారదర్శక ఉన్నదని, దానిని కాలానికి, సమయానికి అనుగుణంగా మార్చుకుని సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకుందామన్నారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు దిగువకోర్టులపై చాలా ఆశలు పెట్టుకున్నాయన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల.. స్థానిక కోర్టుల్లోనే కేసులు పరిష్కారమైతే కక్షిదారులకు ఎంతో మేలు చేసిన వారమవుతామని చెప్పారు. న్యాయవాద సమాజం ప్రజలకు మెరుగైన, సత్వర న్యాయసేవలు అందించేందుకు అవిశ్రాంత కృషి చేస్తున్నదని బార్ అధ్యక్షుడు జగన్మోహన్ తెలిపారు. న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని నిలబెడుతామని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్‌రెడ్డి చెప్పారు. న్యాయమూర్తులతో పాటు సిబ్బంది కొరత ఉన్నప్పటికీ అనుకున్న దాని కన్నా ఎక్కువగానే కేసులు పరిష్కారమవుతున్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్‌బాబు, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్బూ ఉపాధ్యాయ్, హరికృష్ణ, హరికుమార్, చైతన్య, బార్ సభ్యులు పాల్గొన్నారు.