నిజామాబాద్ నగరంలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తింది. గులాబీ కండువాలు వేసుకొని వేలాదిగా జనం తరలివచ్చారు. జననేత, అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ను చూసేందుకు వచ్చిన ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో జీజీ కళాశాల మైదానమంతా జాతరను తలపించింది. బీఆర్ఎస్ జెండాలు, కటౌట్లతో నగరం గులాబీమయమైంది.
జయహో కేసీఆర్…అంటూ యువకులు ప్లకార్డులను ప్రదర్శించారు. రాష్ట్ర అభివృద్ధి, ఇందూరు ప్రగతి సాధించిన విధానంపై సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు. మున్ముందు మరింత అభివృద్ధి సాధించేందుకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తాను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునివ్వడంతో జనమంతా చేతులెత్తి జైకొట్టారు.