ఏర్గట్ల, జనవరి 22 : కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఏ గ్రామంలో చూసి నా అభివృద్ధి కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో రూ.50 లక్షలతో చేపట్టనున్న మల్లన్నస్వామి ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజచేశారు. గుమ్మిర్యాల్ గ్రామం నుంచి ఇబ్రహీంపట్నం మండలం కొండాపూర్ వరకు కోటీ 50 లక్షలతో, దోంచంద నుంచి గుమ్మిర్యాల్ వరకు రూ.60లక్షలతో, దోంచంద నుంచి తడ్పాకల్ వరకు రూ. 3 కోట్లతో చేపట్టనున్న రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు.
గుమ్మిర్యాల్ లిఫ్ట్‌ద్వారా గ్రామ రైతులకు అందుతున్న సాగునీటి గురించి గ్రామస్తులను అడిగి మం త్రి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం మంత్రి సమక్షంలో దోంచంద గ్రామానికి చెందిన బీసీ సంఘ సభ్యులు 50 మంది బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జనరంజక పాలన చూసి వివిధ పార్టీల నాయకులు,కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ఆయన పాలన కోసం దేశం ఎదురుచూస్తోందన్నారు.
తిట్టడమే పనిగా పెట్టుకున్న ఎంపీ అర్వింద్
జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని మంత్రి వేముల మండిపడ్డారు. పుసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్‌పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేశాడన్నారు. ఏ ఒక్క మంచి పనిచేయకుండా తాము ప్రజలకు మంచి చేస్తే నోటికొచ్చినట్లు తిడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్వింద్ కన్నా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మేలని అన్నారు. ఆయన ఉన్నప్పుడు అప్పుడప్పుడు గ్రామాల్లో తిరిగి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. బాల్కొండ నియోజకవర్గంలో తాను ఇప్పటివరకు పదివేల మందికి దాదాపు రూ.40 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరుచేశానని తెలిపారు.
ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి ఎంతమందికి చెక్కులను ఇప్పించావో చెప్పాలని ఎంపీ అర్వింద్‌ను ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్‌కు స్కూటర్, మోటర్ సైకిల్ ఉన్నవారు అర్హులు కాదన్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వర్తించని వారికి తాను సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇప్పిస్తున్నట్లు తెలిపారు. బాధ్యత గల ఎంపీ పదవిలో ఉండి బేవకూఫ్ లాంటి పదాలను వాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఎవరు బేవకూఫ్ అనేది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం, ఎంపీటీసీలు జక్కని మధుసూదన్, బోల్లి శంకర్, విండో చైర్మన్ పెద్దకాపు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు గుల్లే లావణ్యాగంగాధర్, భీమనాతీ భానుప్రసాద్, రాజారెడ్డి, గద్దె రాధాగంగారాం, పత్తిరెడ్డి ప్రకాశ్ రెడ్డి, మంజులా బాలజీగౌడ్, కుండ నవీన్, పద్మాసాగర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు.
ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదు
వేల్పూర్, జనవరి 22: ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేసీఆర్ ప్రభుత్వానికి లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలంటూ కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు పైవిధంగా బదులిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని రెండోసారి ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించుకున్నారని అన్నారు. తమ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ పూర్తికాలం పాలించాలని ప్రజలు ఆదేశించారన్నారు. పూర్తికాలం అధికారంలో ఉంటామని మంత్రి వేముల స్పష్టం చేశారు.