సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏతో పాటు ఆయా రంగాల్లో విస్త్రతస్థాయిలో పరిశోధనలు నిర్వహిస్తూ, సాంకేతిక విద్యా బోధనను అందుబాటులోకి తీసుకురావడంలో విశేషంగా కృషిచేస్తున్న జేఎన్టీయూహెచ్ (జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్) త్వరలోనే నూతన క్యాంపస్‌లోకి మారనున్నది. అందుకోసం జేఎన్టీయూ అధికారులు తీవ్రస్థాయిలో కృషిచేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న జేఎన్టీయూ -హైదరాబాద్ క్యాంపస్ కేవలం 80 ఎకరాల స్థలంలో ఉండడంతో ఇక్కడ పెరుగుతున్న విద్య, పరిశోధన అవసరాలకు అనుగుణంగా ఈ క్యాంపస్ సరిపోవడం లేదని అధికారులు గుర్తించారు.
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ వంటి సాంకేతిక విద్యాబోధనను అందుబాటులోకి తీసుకురావాలంటే కనీసం 500 ఎకరాల స్థలంలో యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఆమోదిస్తే జేఎన్టీయూను నూతన క్యాంపస్‌లోకి తరలించి, ప్రస్తుతం కొనసాగుతున్న కూకట్పల్లి క్యాంపస్‌ను యూనివర్సిటీ పీజీ కాలేజీగా మార్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఇప్పటికే రెండుసార్లు చర్చించినట్లు పేర్కొన్నారు.
ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్..!
హైదరాబాద్ ప్రస్తుతం ఎడ్యుకేషన్ హబ్‌గా మారిందని యూనివర్సిటీ ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి ఫారిన్ యూనివర్సిటీలతో చేసుకుంటున్న ఒప్పందాలు, ప్లేస్మెంట్ కోసం ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్, జే హబ్‌తో పాటు పరీక్షల నియంత్రణ విభాగం, పరిపాలనా విభాగం, స్కూల్ ఆఫ్ కంటిన్యూయింగ్ అండ్ లెర్నింగ్‌తో పాటు సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, రీసెర్చ్ సెల్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించి ల్యాబ్‌ల కోసం ప్రస్తుతం క్యాంపస్ సరిపోవడం లేదనే అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఇరుకుగా హాస్టల్ భవనాలు..
నగరం నడిబొడ్డున 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్ విద్యాబోధనా అవసరాలను తీర్చలేకపోతున్నది. ఐదు వేలకు పైగా ఉన్న విద్యార్థుల కోసం ఎలాంటి వసతులు కల్పించలేని పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం 11 అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు, ఐదు ఎక్స్లెంట్ సెంటర్లు, ఆరు యూనివర్సిటీ కాలేజీలు, నాలుగు అకడమిక్ యూనిట్లతో ప్రస్తుతం కొనసాగుతున్నది. అలాగే బీటెక్‌లో 11 బ్రాంచ్‌లు, బీ-ఫార్మసీ, ఎంటెక్‌లో 28 స్పెషలైజేషన్లు, ఎంఎస్సీలో నాలుగు స్పెషలైజేషన్లు, ఎంటెక్, ఎంఎస్‌లో పీహెచ్డీ ప్రొగ్రాములు అందుబాటులో ఉన్నాయి.
వాటిని భవిష్యత్ అవసరాల కోసం విస్తృతం చేయాల్సి ఉంది. పైగా టీచింగ్ ఫ్యాకల్టీ క్వార్టర్స్ కూడా ఉన్నప్పటికీ వాటికి తగిన వసతులు కరువయ్యాయి. క్యాంపస్ విద్యార్థుల కోసం లేడీస్ హాస్టల్ నిర్వహణ కూడా కష్టతరంగా మారింది. సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్నాయి. పైగా యూనివర్సిటీ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సెమినార్ గదులు ఇరుకుగా మారాయి. ఇక క్యాంపస్‌లో కొత్త బ్లాకులు నిర్మించే పరిస్థితులు లేవు. ఇటీవల యూనివర్సిటీ క్యాంపస్‌లో సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్ ఏర్పాటు చేసినప్పటికీ పార్కింగ్ ఇబ్బందులు తీవ్రంగా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వీఐపీలు వచ్చిన సమయంలో ట్రాఫిక్ సమస్య అధికారులను, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నది.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ప్రస్తుతం ఇంజినీరింగ్ కోర్సుతో పాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ పరిశోధనా వసతులు తక్కువగానే ఉన్నాయి. రిఫరెన్స్ కేంద్రాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవన్న అభిప్రాయాలు యూనివర్సిటీ అధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం క్యాంపస్‌లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి ఉన్నది. కనీసం 500 ఎకరాల స్థలం ఉంటేనే అన్ని వసతులు కల్పించే వీలుంటుందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, ఆమోదం కోసం త్వరలోనే ప్రభుత్వానికి పంపుతామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్‌హుస్సేన్ తెలిపారు.