వినాయక్‌నగర్, జూన్ 23: నిజామాబాద్ విద్యుత్‌శాఖలో ఐదు రోజుల క్రితం జరిగిన ఏఈ సంతకం ఫోర్జరీ ఆరోపణపై సీఎండీ సీరియస్‌గా పరిగణించారు. అందుకు సంబంధించిన బాధ్యులు ఎవరనే విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నివేదికను అందించాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ విద్యుత్ శాఖ డీ-8 సెక్షన్ ఏఈ సెలవులో ఉన్న సమయంలో ఓ సంస్థకు మీటర్ జారీ చేస్తూ మంజూరు చేసిన ఆర్డర్ కాపీలో ఉన్నది తన సంతకం కాదని, ఫోర్జరీ జరిగినట్లు ఏఈ శ్రీవిద్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై క్వాలిటీ కంట్రోల్ ఏడీఈ మూడు రోజుల క్రితం సంబంధిత ఏఈతోపాటు జేఎల్ఎం, మీటర్ విభాగానికి చెందిన మరో ఉద్యోగిని విచారించారు. అనంతరం నివేదికను సీఎండీకి పంపించారు. డీ-8 ఏరియాలో జేఎల్ఎం బానోత్ రవి ఏఈ సంతకం ఫోర్జరీ చేసినట్లుగా విచారణలో తేలింది. దీంతో అక్రమానికి పాల్పడిన జేఎల్ఎంను ఎస్ఈ రవీందర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ డీఈ శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.