ఖలీల్‌వాడి, మార్చి 13 : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడం అప్రజాస్వామికమని, కాంగ్రెస్ ప్రభుత్వ అధికార అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు.
ప్రభుత్వ దుర్నీతిపై బయట ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లపాలు చేస్తున్నారని, అసెంబ్లీలో నిలదీస్తే సభ నుంచి గెంటేస్తున్నారన్నారు. జగదీశ్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా ప్రజల పక్షాన పోరాడేవారి గొంతు నొక్కడమే ఇందిరమ్మ రాజ్యమా? అని జీవన్ రెడ్డి నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నొక్కింది బీఆర్ఎస్ సభ్యుల గొంతు కాదని, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతు అని ఆయన మండిపడ్డారు. అప్రజాస్వామిక చర్యలను ఎండగడుతూ ప్రజాక్షేత్రంలో పోరాడుతామన్నారు.
జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు జీవన్‌రెడ్డి తెలిపారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో పార్టీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనపై నిరసన తెలపాలని జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.