వేల్పూర్, జనవరి 27 : ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ జమున మృతికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి తెలుగువారి అభిమాన తారగా వెలుగొందారని పేర్కొన్నారు. తెలుగు, తమిళం, కన్నడతోపాటు హిందీ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న జమున మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. సినీనటిగానే కాకుండా పార్లమెంట్ సభ్యురాలిగా ఆమె ప్రజాసేవ చేయడం గొప్ప విషయమని గుర్తుచేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమున పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని మంత్రి ప్రార్థించారు.