కంఠేశ్వర్, జూన్ 6 : ప్రజాకవి, రచయిత, తెలంగాణ విముక్తికోసం నిజాంతో పోరాటం చేసిన దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం నిర్వహించని పక్షంలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె దాశరథిని నిర్బంధించిన ఖిల్లా రామాలయాన్ని సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తిచాటి నిజాం పాలకులను గడగడలాడించిన మహోన్నతమైన వ్యక్తి ని విస్మరించడం ప్రభుత్వానికి సిగ్గు చేటన్నారు.
నిజామాబాద్ జైలులో బొగ్గుతో ఆయన రాసిన తెలంగాణ విముక్తి పోరాట గీతాలు స్ఫూర్తి రగిలించాయన్నారు. ఆ రోజు ఉద్యమ ఆకాంక్షను రగిల్చిన ఈ ప్రాంతాన్ని భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. ఎమ్మెల్సీగా తన నిధులు రూ. 40 లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాశరథి శతజయంతిని ఘనంగా నిర్వహించాలని పలుమార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. దున్నపోతు మీద వానపడ్డట్లుగా ఈ ప్రభుత్వం తీరు ఉన్నదన్నారు. బిరుదు రాజు రామరాజు శత జయంతిని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
జిల్లా పరిసర ప్రాంతాల్లోని కవులు, రచయితలు, తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. తెలంగాణలో పుట్టిన దాశరథి ప్రతిభను ఇప్పటితరం వారికి పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు.
తెలంగాణపై సోయిలేని ప్రభుత్వం శత జయంతి ఉత్సవాల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూస్తామన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వచ్చే జూలై 21, 22వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కవులు, రచయితలు, ఉద్యమకారులను ఆహ్వానించి అత్యంత ఘనంగా దాశరథి శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు.