సాగు సంక్షోభంలో చిక్కుకున్నది. దిక్కు తోచని స్థితిలో రైతాంగం దిగాలు చెందుతున్నది. బోర్లు ఎత్తిపోయి ఎండిన పంటలు.. బోర్లు వేసేందుకు చేసిన అప్పులు.. పెట్టుబడి రాక అన్నదాత గుండె చెరువైంది. ఇక, చేతికొచ్చిన పంట కాంటాలు కాక కల్లాలు దాటడం లేదు. రోజుల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ స్థితిలో ఏం చేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో రైతులు దాదాపు పది లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు వేశారు. అయితే, వరి పొట్ట పోసుకునే సమయంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నమే చేశారు. నాలుగైదు బోర్లు వేసినా నీటి జాడ కరువైంది. పంట సాగుకు పెట్టిన పెట్టుబడితో పాటు బోర్లకు అయిన ఖర్చు మీద పడింది. రూ.లక్షల్లో అప్పులు మీద పడడంతో రైతాంగం దిగాలు చెందుతోంది. అప్పులు తీర్చేదారి కనిపించక దోమకొండ మండలంలో ఓ యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఎలాగోలా కష్టపడి పండించిన వడ్లు అమ్ముకునేందుకూ రైతులకు ఇక్కట్లు తప్పట్లేదు. పంట కోసి పక్షం రోజులైనా కాంటాలు పడట్లేదు. ధాన్యం కల్లాలు దాటట్లేదు. ఏ రోడ్డు చూసినా వడ్ల కుప్పలతో నిండిపోయి కనిపిస్తున్నది. కొన్నిచోట్ల అయితే రోడ్డుకు ఇరువైపులా ధాన్యం రాసులే దర్శనమిస్తున్నాయి. ఏడాదిన్నర వ్యవధిలోనే మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. పంట కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. గన్నీసంచులు లేవని, కాంటాలు వేయట్లేదని, తూకం వేసిన బస్తాలు తరలించట్లేదని అన్నదాతలు తరచూ ఆందోళనకు దిగుతున్నారు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండేదని గుర్తు చేసుకుంటున్న రైతులు.. ప్రభుత్వ మార్పు ముంచేదే తప్ప మంచిది కాదని చెబుతున్నారు.
బీబీపేట్(దోమకొండ), మే 3: సాగునీటి జాడ కోసం చేసిన భగీరథ ప్రయత్నం విఫలమైంది. పది లక్షల దాకా అప్పు మీద పడింది. అది తీర్చే దారి కనిపించక పోవడంతో ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో శనివారం ఈ విషాద ఘటన చోటు చేసుకున్నది. ఎస్సై స్రవంతి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగమేశ్వర్ గ్రామానికి చెందిన యువ రైతు పంతులుగారి పెంటయ్య(26)కు రెండెకరాల భూమి ఉంది. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబం.
పొలంలో నీటి వసతి సరిగా లేకపోవడంతో పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు పెంటయ్య బోర్లు వేశాడు. రెండేండ్ల వ్యవధిలోనే పదికి పైగా బోర్లు వేశాడు. చుక్కనీరు రాకపోగా, అప్పే మిగిలింది. రూ.10 లక్షల దాకా రుణ ఊబిలో కూరుకుపోయిన పెంటయ్య.. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం తెల్లవారుజామున ఇంట్లోనే చీరతో ఉరేసుకున్నాడు. ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. మృతుడి తల్లి మణెవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పదేండ్ల పాటు సంతోషంగా పంటలు పండించుకున్న రైతులు ఏడాదిన్నర వ్యవధిలోనే చిక్కుల్లో పడ్డారు. సర్కారు సాయం కరువై దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కేసీఆర్ హయాంలో పంట సాగుకు ముందే ఠంచన్‌గా రైతుబంధు అందించడంతో పెట్టుబడికి తిప్పలు తప్పాయి. ఫుల్లుగా కరెంట్, దండిగా నీళ్లు ఉండడంతో రెండు పంటలకు ఢోకా లేకుండా పోయింది.
ఊరూరా కల్లాలు పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో రైతుల కష్టాలు దూరమయ్యాయి. అయితే, ఏమైందో ఏమో కానీ కాంగ్రెస్ వచ్చిన ఏడాదిన్నరలో పరిస్థితి తారుమారైంది. రైతుబంధు ఆగిపోయింది. రెండు సీజన్లకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఎగ్గొట్టింది. మొన్న యాసంగిలో రైతుభరోసా అమలు చేసినా, ఇంకా సగానికంటే ఎక్కువ మంది రైతులకు రాలేదు. మరోవైపు, చాలా మందికి రుణమాఫీ కాక అప్పుల ఊబి నుంచి బయటపడ లేకపోయారు.