బోధన్ రూరల్, మార్చి 6: నిజాంసాగర్ కాలువ చివరి ఆయకట్టుకు నీరందక పొట్ట దశలో ఉన్న వరి పంటలు ఎండిపోతుండడం రైతులను కలచివేస్తున్నది. సాలూర మండలంలోని నిజాంసాగర్ కెనాల్ డీ -28 కింద సాగ వుతున్న పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఓ రైతు బుధవారం ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. సాలూర మం డలం కొప్పర్తి క్యాంప్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గురునాథం.. నిజాంసాగర్‌లో పుష్కలంగా నీళ్లుండడంతో పంటకు ఢోకా ఉండదని భావించి జాడిజమాల్‌పూర్ శివారులో ఉన్న ఆరున్నర ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి వేశాడు.
తీరా పంట పొట్ట దశకు వచ్చే సరికి రెండు బోర్లు ఎత్తిపోవడం, మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో నిజాంసాగర్ చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. బోధన్, సాలూర మండలాల్లో నిజాంసాగర్ డి-28/15 కెనాల్ పరిధిలోని ఆయకట్టుకు నీళ్లందక పొలాలు ఎండిపోతున్నాయి. అప్పు చేసి సాగుచేస్తే చేతికందే దశలో పంట ఎండిపోవడంతో గురునాథం తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం పురుగుల మందు డబ్బా తీసుకుని వెళ్తుండడాన్ని గమనించిన తోటి రైతులు డబ్బా లాగేశారు.
రూ.లక్షలు అప్పు చేసి ఆరున్నర ఎకరాల్లో వరి వేస్తే, చేతికొచ్చే సమయంలో నీళ్లు అందక ఎండిపోతున్నదని గురునాథం కుమారుడు కృష్ణప్రసాద్ తెలిపాడు. ఈ నేపథ్యంలో రైతుల సాగునీటి ఇబ్బందులపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘పంట ఎండే…గుండె చెదిరే’, ‘పంట ఎండిపోతున్నదనే బాధతో రైతు ఆత్మహత్యాయత్నం’ శీర్షికన గురువారం కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన ఇరిగేషన్ ఏఈ శృతితోపాటు అధికారులు, సిబ్బంది నిజాంసాగర్ కెనాల్‌కు చేరుకొని పరిశీలించారు. సాలూర మండలంలోని జాడిజామల్పూర్, బోధన్ మండలంలోని రాంపూర్ శివారులోని చివరి ఆయకట్టుకు వరకు నీళ్లు అందేలా చర్యలు తీసుకున్నారు. ఎండుతున్న పంటలకు నీళ్లు పారుతుండడంతో రైతులు అనందం వ్యక్తం చేశారు. నమస్తే తెలంగాణ పత్రికకు ధన్యవాదాలు తెలిపారు.