కంటేశ్వర్ : తమది ప్రజా పాలన అని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం ప్రజల పోరుపై ఉక్కుపాదం మోపుతుంది. నిన్నటి వరకు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన నిషేధాలు (Ban) జిల్లా కేంద్రాలకు పాకాయి.
తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఇకపై నిరసనలు నిషేధమంటూ హెచ్చరిక బోర్డులు పెట్టడం సంచలనం కలిగిస్తోంది. కలెక్టరేట్ల ఎదుటే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం నిషేధమని, ఒకవేళ ఎవరైనా నిరసన కార్యక్రమాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రూరల్ పోలీసులు( Rural Police) హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
నిరసన కార్యక్రమాలకు మున్సిపాలిటీ భవనం పక్కన ధర్నా చౌక్ స్థలం కేటాయించామని, నిరసనలకు అక్కడ కూడా ముందస్తు అనుమతి పొందాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రజావాణి కొచ్చిన పలువురు హెచ్చరిక బోర్డు ను చూసి కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తేనే పట్టించుకునే నాధుడు లేడని, ఇక మున్సిపాలిటీ వద్ద కూర్చొని ధర్నా చేస్తే ఎవరు పట్టించుకుంటారని వాపోతున్నారు.