వినాయక్‌నగర్, నవంబర్ 16: ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, అందులోని కాపర్ కాయిల్స్‌ను చోరీ చేసే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 40కిలోల కాపర్ కాయిల్స్.. రూ.5.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పది మందిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ఆదివారం కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇందల్వాయి మండలంలోని గన్నారం వద్ద శనివారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.
అనుమానాస్పదంగా వచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తాము ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ చోరీ చేస్తున్నట్లు అంగీకరించారని సీపీ తెలిపారు. నిందితుల్లో తుంబారే సుధాకర్ (మహారాష్ట్ర), హర్బీర్ శర్మ (ఉత్తర్‌ప్రదేశ్), అలీ మహమ్మద్ (గుంటూరు), శానపల్లి రవీందర్ (మహబూబ్‌నగర్), యడాల వెంకటేశ్వర్లు (ప్రకాశం) ఉన్నారని అన్నారు. వారు చోరీ చేసిన కాయిల్స్‌ను గాజుల శ్రీశైలం (సిద్దిపేట జిల్లా), మహమ్మద్ హైదర్ అలీ (హైదరాబాద్), లింగప్ప (మెదక్ జిల్లా) కొనుగోలు చేసినట్లు చెప్పారు. వారి నుంచి 40 కిలోల కాపర్ కాయిల్స్, రూ.5.5లక్షల నగదు, సెల్ఫోన్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరితోపాటు మరో ఇద్దరు నిందితులు అనిల్(మేడ్చల్), వలీ (ఉత్తరప్రదేశ్) పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని చెప్పారు. వీరు ఇందల్వాయి, ధర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్‌పల్లి, మెండోరా, ముప్కాల్, మోర్తాడ్, మోపాల్, బోధన్, నవీపేట్, వర్ని మండలాల్లో పంట పొలాల వద్ద ఉన్న 101 విద్యుత్ టాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్‌ను చోరీ చేశారని చెప్పారు. కేసును ఛేదించడంలో నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని, డిచ్పల్లి సీఐ వినోద్, ఇందల్వాయి, డిచ్పల్లి, జక్రాన్‌పల్లి ఎస్సైలు సందీప్, షరీఫ్, మహేశ్‌తోపాటు సిబ్బంది కిరణ్‌గౌడ్, ప్రశాంత్, సందీప్, కిశోర్‌కుమార్, సుజిత్, నవీన్, సర్దార్‌ను సీపీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు.