వినాయక్‌నగర్, జూలై 11: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లజాము వరకు నాలుగుచోట్ల చోరీలకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టాటా సుమో వాహనంలో వచ్చిన ముఠాకు చెందిన నలుగురు సభ్యులు ముందుగా నిర్మల్ జిల్లాలోని ఓ అపార్ట్మెంట్లో దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లాలోనికి ప్రవేశించి తెల్లవారు జామున ఆర్మూర్ పట్టణంలోని ఓ మెడికల్ షాపు షట్టర్ ధ్వంసం చేసి, అందులోని రూ. లక్షా పదివేల నగదును ఎత్తుకెళ్లారు.
అక్కడి నుంచి ఉదయం 4.55 గంటల ప్రాంతంలో మాక్లూర్ మండల పరిధిలోని శ్రీనగర్ కాలనీలో లక్ష్మీ అనే ఓ మహిళ మెడలోంచి రెండు తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకొని పరారయ్యారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చేరుకున్నారు. 5.25 గంటల సమయంలో ప్రవీణ అనే ఓ మహిళ ఇంటి ముందు వాకిలి ఊడుస్తుండగా టాటా సుమోలో వచ్చిన నలుగురు దుండగులు ఆమె మెడలోంచి బంగారు పుస్తెలతాడు తో పాటు ఓ చెవికమ్మ సైతం లాక్కున్నారు. మరో చెవి కమ్మను లాక్కునేందుకు యత్నించగా బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ఆమె భర్త పరిగెత్తుకొని రావడంతో దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన అంతర్రాష్ట్ర ముఠానే ఈ వరుస దోపిడీలకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
చైన్ స్నాచింగ్ గురించి తెలుసుకున్న సీపీ సాయిచైతన్య ఘటనా స్థలిని సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం దర్యాప్తు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, నిందితులను గుర్తించాలని ఆదేశించారు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని, నేరస్తుల కదలికలను సాంకేతిక ఆధారాలతో విశ్లేషించాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్ లేదా డయల్ 100కు సమాచారమందించాలని కోరారు. సీపీ వెంట అదనపు డీసీపీ (అడ్మిన్) శుభంప్రకాశ్, ఏసీపీ ప్రకాశ్‌యాదవ్, సీఐ శ్రీనివాస్‌రాజ్, త్రీ టౌన్ ఎస్సై హరిబాబు, పోలీసు అధికారులు ఉన్నారు. చైన్‌స్నాచింగ్ ఘటనపై బాధితురాలు ప్రవీణ ఫిర్యాదు మేరకు 3వ టౌన్ ఎస్సై హరిబాబు కేసు నమోదు చేశారు.