వినాయక్‌నగర్, మే 27: మహారాష్ట్ర కేంద్రంగా ఫార్మా కంపెనీ పేరిట అక్రమంగా అల్ప్రాజోలం తయారుచేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నా రు. ముఠాకు సంబంధించిన వివరాలను సీపీ సాయి చైతన్య మంగళవారం కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ హాల్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
బోధన్‌లో ఈ నెల 15, 16వ తేదీల్లో 2.5 కిలోల అల్ఫ్రాజోలంతో పట్టుబడిన ముఠా సభ్యులపై కేసు నమోదు చేసి రి మాండ్‌కు తరలించినట్లు తెలిపారు. విచారణలో అల్ప్రాజోలం ముఠా ఆగడాలు వెలుగుచూసినట్లు పేర్కొన్నారు. నార్కోటిక్ డ్రగ్ బృందం ఇంటర్ షిప్ ద్వారా బోధన్ ఏసీపీ శ్రీనివాస్ పర్యవేక్షణలో బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు తన టీమ్‌తో కలిసి ఈ ముఠా అక్రమ దందాను బహిర్గతం చేసినట్లు వివరించారు.
ముఠా సభ్యుల ఆస్తులు సీజ్
మహారాష్ట్రలోని సతారా జిల్లా పరిధిలో ఉన్న సూర్య ప్రభ ఫార్మా కెమికల్ ఇండస్ట్రీలో నిషేధిత మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించి, తమ బృందం అక్కడికి వెళ్లగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూసినట్లు సీపీ పేర్కొన్నారు. సూర్య ప్రభ ఫార్మా కెమికల్ ఇండస్ట్రీ నిర్వాహకుడు అమర్ సింగ్ దేశ్‌ముఖ్, బయో స్టిములెంట్ కంపెనీ నిర్వాహకుడు బాబూరావ్ బస్వరాజ్ కడేరీ, కాశీ ట్రేడర్స్ ఫార్మా కంపెనీ నిర్వాహకుడు విశ్వనాథ్ కలిసి ముఠాగా ఏర్పడి అల్ఫ్రాజోలం తయారుచేస్తున్నారని తెలిపారు.
వాటిని లక్ష్మణ్‌గౌడ్ అనే మధ్యవర్తి ద్వారా తెలంగాణలోని పలు కల్లుడిపోలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. దీంతో నలుగురిని కస్టడీలోకి తీసుకొని విచారించి, మహారాష్ట్రలోని సోలాపూర్‌కు వెళ్లే జాతీయ రహదారి పక్కన బాబూరావ్కు సంబంధించిన కంపెనీలో నిల్వ ఉంచిన 30 కేజీల అల్ప్రాజోలం(విలువ రూ.3 కోట్లు)ను సీజ్ చేసినట్లు సీపీ తెలిపారు.
అలాగే అమర్ సింగ్ దేశ్‌ముఖ్ ఇంటి నుంచి రూ.12 లక్షల నగదు, రూ.4 కోట్లు విలువ చేసే సూర్యప్రభ ఫార్మా కంపెనీతోపాటు వీరు వినియోగించిన ఫోర్డ్ కారును సైతం సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ముఠాను పట్టుకోవడానికి కృషి చేసిన పోలీసు అధికారులకు సీపీ సాయి చైతన్య రివార్డులను అందజేశారు.