Inter-state cow theft gang | వినాయక్ నగర్, మే 22: గత కొంతకాలంగా నిజామాబాద్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలలో రోడ్లపై పడుకుని ఉన్న ఆవులను దొంగిలించే అంతర్రాష్ట్ర ముఠాను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడించారు. కార్లకు దొంగ నెంబర్ ప్లేట్లు పెట్టుకొని రాత్రి వేళల్లో కాలనీలలో తిరుగుతూ జనసంచారం లేని ప్రాంతాలలో ఆవులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి, అవి స్పృ కోల్పోయిన అనంతరం కార్లలో వాటిని ఎత్తుకుపోతున్న మహారాష్ట్ర ముఠా పోలీసుల కండ్లు కప్పి తిరుగుతుండడాన్ని గుర్తించారు.
వారం రోజుల క్రితం సైతం నిజామాబాద్ నగరంలోని నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆవులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి వాటిని కారులో ఎత్తుకొని వెళ్లే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు మేలుకోవడంతో దుండగులు కారులో పరారయ్యారు. ఈ ఘటనపై సంబంధిత నాలుగోవటాని ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ముఠాలు పట్టుకునేందుకు సీసీఎస్ టీమును రంగంలోకి దింపారు.
నిజామాబాద్ సీసీఎస్ టీం మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో ఈ ఆవుల దొంగల ముఠా కు చెందిన సయ్యద్ ఉమర్, సయ్యద్ అమీర్, అబ్దుల్ కలాం, సయ్యద్ సోహెబ్, సమీర్ అలీ, మహబూబ్ ఆరుగురు నిందితులను పట్టుకొని , వారు వినియోగించిన కారును సీజ్ చేసి, నిందితులను మహారాష్ట్రలోని దేగ్లూర్ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ ముఠాను పట్టుకునేందుకు నిజామాబాదు సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ తో పాటు సిబ్బంది యాదగిరి, సుభాష్, నీలేష్, నరేష్ కృషి చేసినట్లు వెల్లడించారు.