కామారెడ్డి, జనవరి 28 : ఇంటర్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకు 48 కేంద్రాల్లో ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి 25వ తేదీవరకు 38 కేంద్రాల్లో థియరీ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.
థియరీ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి షేక్ సలాం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు, డీఈవో రాజు, ఆర్టీసీ, వైద్యం, తపాలా, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.