వినాయక్‌నగర్, జూన్ 3: నిజామాబాద్ జిల్లాతోపాటు హైదరాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకొన్నారు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ పాత నేరస్తుడు నిజామాబాద్ నగరానికి చెందిన ఏడుగురు సభ్యులను తన ముఠాలో చేర్చుకొని, వారితో కలిసి వరుసగా చోరీలకు పాల్పడ్డాడు. ఈ ఘరానా ముఠా చేసిన దొంగతనాలు, ముఠా సభ్యుల వివరాలను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య కమాండ్ కంట్రోల్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిజామాబాద్ ఏసీపీ ఎల్.రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి ఈ అంతర్ జిల్లా ఘరానా ముఠాను పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్ ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు మహ్మద్ ఆమేర్ నిజామాబాద్ నగరానికి చెందిన పాతనేరస్తులైన మరో ఏడుగురితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదు, ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 24 రాత్రి దొంగతనాలకు పాల్పడడంతో పాటు హైదరాబాద్ శివారులోని షాపూర్, జీడిమెట్ల ప్రాంతాల్లో 15 ఆటోలను దొంగిలించినట్లు పేర్కొన్నారు. సదరు పాత నేరస్తుడిని అదుపులోకి తీసుకుని విచారించి, ఈ ముఠాకు చెందిన మహ్మద్ అబ్దుల్, ఆసిఫ్, వసీం, సోహైల్, జావిద్ ఖాన్, రియాజ్, ఆసీఫ్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ముఠాకు చెందిన అలీ అలియాస్ బబ్లూ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
నిందితుల నుంచి 15 తులాల బంగారు నగలతోపాటు కారు, మూడు బైకులను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. ముఠాను పట్టుకునేందుకు సౌత్ రూరల్ సీఐ సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావ్, సిబ్బంది కృషి చేశారని, ఈ సందర్భంగా వారికి సీపీ చేతుల మీదుగా రివార్డులను అందజేశారు.