నాగిరెడ్డిపేట్, జూన్ 25: నాగిరెడ్డిపేట్ జగ్గని చెరువు కట్టపై శివాజీ విగ్రహ ఏర్పాటు కోసం చేపట్టిన భూమిపూజా కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. చెరువు కట్ట బఫర్‌జోన్‌లో ఉన్నదని, విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని ఇరిగేషన్ అధికారుల నుంచి ఫిర్యాదు వచ్చిందని పోలీసులు తెలుపడంతో భూమిపూజ చేయడానికి వచ్చిన ప్రముఖశాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి వెనుదిరిగారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం ఎవరితరం కాదని, విగ్రహం ఏర్పాటు చేసుకునేందుకు అనువైన స్థలం ఉన్నదని తెలిపారు.
కాంగ్రెస్ నాయకుల కుట్ర మూలంగా అధికారులు భూమి పూజను అడ్డుకున్నారని ఆరోపించారు. విగ్రహాల ఏర్పాటుకు ఇక్కడ బఫర్ జోన్ అంటున్నారని, అలా అయితే హుస్సేన్ సాగర్‌పై ఏర్పాటు చేసిన విగ్రహాలన్నింటినీ కూల్చేయాలన్నారు. విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటే ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయిస్తామని స్పష్టం చేశారు. విగ్రహ ఏర్పాటుకు గ్రామ సర్పంచ్ తీర్మానం చేసి ఇవ్వాలని కోరారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఈశ్వర్ తదితరులు ఉన్నారు.
జగ్గని చెరువు కట్టపై శివాజీ విగ్రహ ఏర్పాటు కోసం ఎవరూ కూడా అనుమతి తీసుకోలేదు. చెరువు ఎఫ్టీఎల్ నుంచి 30 మీటర్ల దూరం వరకు చెరువు పరిధి ఉంటుంది. 30 మీటర్ల లోపల ఎవరు ఏ పని చేపట్టడానికి వీలులేదు. చెరువు కట్టపై విగ్రహం ఏర్పాటు చేయడానికి అనుమతి కావాలని మమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే ఉన్నతాధికారులతో చర్చించి అనుమతి ఇస్తాం.
-అక్షయ్, ఇరిగేషన్ ఏఈఈ