పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, ప్రజలతో మమేకమై, వారి కష్టాల్లో తోడుగా ఉండే నాయకత్వమే చిరస్థాయిగా నిలుస్తుందని నమ్మే యువనాయకుడు రామన్న! అధికారంలో ఉన్నప్పుడే కాదు.. అధికారంలో లేకపోయినా ఆపదలో ఉన్నవారికి తనవంతు చేయూతనందిస్తున్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్! ఆదుకోండి అన్నా అంటే.. ‘నేనున్నా’నంటూ చేయూతనందిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా స్పందిస్తూ, ఆపన్నులకు అండగా నిలుస్తూ తనలోని మానవీయతను చాటుతూ.. నేటి యువతరానికి అదర్శంగా నిలుస్తున్నారు.
ఎమ్మెల్యేగా ఉంటూ కేవలం ఆ పదవికి మాత్రమే పరిమితం కాకుండా.. ప్రజా సమస్యలు తనవిగా భావించి.. పరిష్కారం కోసం ఎంత దూరమైన వెళ్తూ అందరి మన్నలు పొందుతున్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజలతో అనుబంధమే అసలైన రాజకీయ బలమని నమ్ముతూ తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఏటా తన పుట్టిన రోజున హంగూ ఆర్భాటాలకు పోకుండా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పేరిట వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న ఆయన, శుక్రవారం తన బర్త్‌డే సందర్భంగా మరోసారి సేవా కార్యక్రమాలకు పిలుపినిచ్చారు.

కరీంనగర్, జూలై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ : ప్రజా జీవితంలో పదవులు ఒక బాధ్యతకు ప్రతీక మాత్రమే. కానీ, ప్రజలపై ఉండే నిబద్ధత, మానవీయతకు పదవులతో సంబంధం ఉండదు. ఈ విషయాన్ని తన ఆచరణ ద్వారా నిరూపిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్! ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చిన ఆయన.. ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా తనను ఆశ్రయించే వారికి, వివిధ సమస్యలతో వచ్చే వారికి అండగా నిలుస్తున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం అందించడం, ప్రమాదాల్లో చిక్కుకున్న కుటుంబాలకు అండగా నిలువడం, విద్యార్థులు, యువతకు ఎదురయ్యే సమస్యలపై స్పందించడం, అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం చేసే విజ్ఞప్తులను పరిశీలించడం చేస్తూ తన మానవీయతను చాటుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలను కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినా.. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే అయినా.. వ్యక్తిగతంగా ప్రజల కష్టాలు, బాధలను అర్థం చేసుకోవడంలో.. రాజకీయాలకు అతీతంగా స్పందించడంలో కేటీఆర్ చూపుతున్న చొరవను వర్గాల ప్రజలు ప్రశంసిస్తున్నారు.
‘మంత్రి పదవి లేకపోయినా ప్రజలతోనే.. ప్రభుత్వం లేకపోయినా ఆపన్నులకు అండగానే’ అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా.. ఒక మానవీయ కోణం ఉన్న వ్యక్తిగా కేటీఆర్‌లోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నదని అభిమానులు, పార్టీ శ్రేణులు కితాబిస్తున్నారు. ప్రజా జీవితంలో పదవులు మారినా.. ప్రజలతో ఉన్న అనుబంధం, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే తపన వంటివి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని చెబుతున్నారు.
ప్రజలకు సేవ చేయడానికి స్పందించే మనసు.. సాయం చేయాలనే సంకల్పం ఉంటే చాలని చాటేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. రాజకీయ నాయకుడిగా ఒక వైపు.. మానవతావాదిగా మరో వైపు ప్రజా జీవితంలో తనదైన ముద్ర వేసిన కేటీఆర్, నేటి యువతీ యువకులకు కొత్తగా మార్గనిర్దేశనం చేస్తున్నారు. ప్రధానంగా ప్రజల నుంచి వచ్చే సమస్యలను, ప్రభుత్వంపై వచ్చే విమర్శలను, రాష్ర్టానికి సంబంధించిన అంశాలను సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూ.. పరిష్కారం చూపుతున్నారు. తనను నమ్ముకున్న అభిమానులు, కార్యకర్తలకు కొండంత అండగా ఉంటున్నారు. అధికార పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నా.. ‘నేనున్నా’నంటూ ధైర్యమిస్తున్నారు. అధికారం తాత్కాలికమని.. కానీ, మానవీయత శాశ్వతమంటూ తన సేవా కార్యక్రమాలతో చాటుతూ కష్టాల్లో ఉన్నవారికి భరోసాగా నిలుస్తున్నారు.

సేవా కార్యక్రమాలకు పిలుపు
కోట్లాది మంది హృదయాల్లో చెదరని ముద్ర వేసిన కేటీఆర్, ఏటా తన పుట్టిన రోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పేరిట వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ సారి తన 50వ బర్త్‌డే సందర్భంగా హంగూ ఆర్భాటాలు వద్దని, సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఈ పరిస్థితుల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని సూచించారు. కేక్‌ల కటింగ్‌లు, బొకేలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, పత్రికా ప్రకటనలకు ఖర్చు చేయకుండా.. ఆ ఖర్చులతో సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ఆపదలో ఉన్న వారికి సాయం అందేలా చూడాలని పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పోచవేని ముత్తయ్య చనిపోయినప్పుడు కుటుంబానికి అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ఆయన కూతురు వివాహానికి రూ.50 వేల నగదుతోపాటు కొత్త బట్టలు అందించారు.
తంగళ్లపల్లి మండలం రాంచంద్రాపూర్‌లో గూడు లేని వృద్ధురాలు నీలవ్వకు రూ.6 లక్షలకు పైగా వెచ్చించి ఇల్లు కట్టించారు. గృహ ప్రవేశానికి హాజరై వృద్ధురాలి కుటుంబసభ్యులతో సహఫంక్తి భోజనం చేశారు.

మచ్చుకు కొన్ని..