కంఠేశ్వర్, జూలై 7: వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం ఆమె జక్రాన్పల్లి మండలం మునిపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్సియల్ జూనియర్, డిగ్రీ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని స్టోర్రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ, తరగతి గదులను పరిశీలించారు.
మెనూ ప్రకారం భోజనంతోపాటు మౌలిక వసతులు, సదుపాయాలపై ఆరా తీశారు. వంటగది, డైనింగ్ హాల్, స్టోర్రూమ్ అపరిశుభ్రంగా ఉండి, ఈగలతో నిండి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రతపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నందున ఏజెన్సీని మార్చాలని అధికారులను ఆదేశించారు. వానాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణ విషయంలో రాజీ పడొద్దన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ శుచి, శుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. అనంతరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ తరగతి గదిని సందర్శించి, విద్యార్థినులతో ముచ్చటించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి విద్యార్థినుల నుంచి సమాధానాలు రాబట్టారు. ప్రతిభ చూపిన బాలికలకు బహుమతులు అందించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ కిరణ్మయి, ప్రిన్సిపాల్ అనూష తదితరులున్నారు.