మోర్తాడ్/ ఆర్మూర్ టౌన్, మే 13: కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు.. అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన ఆర్మూర్, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్, కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రా మాల్లో పర్యటించారు. ఆర్మూర్‌లోని ధోబిఘాట్ వద్ద ధాన్యం నిల్వలతోపాటు తిమ్మాపూర్, ఉప్లూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. రైతుల నుంచి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా! ధా న్యం అమ్మకాల వివరాలతో కూడిన రసీదులు అందిస్తున్నారా? అని ఆరా తీశారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యానికి తావిచ్చే సొసైటీలకు వచ్చే సీజన్లో కేంద్రాలను కేటాయించవద్దని పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకూడదని, ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి తూకం చేయించాలని నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే నిర్దేశిత మిల్లులకు తరలించాలని, లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మిల్లుల వద్ద సకాలంలో అన్లోడింగ్ చేసుకునేలా పర్యవేక్షించాలన్నారు. సూపర్అమన్ రకం ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు కొంతమంది మిల్లర్లు విముఖత చూపుతున్నారని కేంద్రాల నిర్వాహకులు తెలుపగా.. మిల్లర్లతో సమావేశమై ఇబ్బందులు లేకుం డా చూస్తామని కలెక్టర్ అన్నారు. ఆలస్యంగా పంటదిగుబడి అందిన అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచామని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్వో అరవింద్‌రెడ్డి, సివిల్‌సప్లయ్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, డీసీవో శ్రీనివాస్, డీపీఎం సాయిలు, సొసైటీ చైర్మన్లు కల్లెంఅశోక్, రేగుంట దేవేందర్, తహసీల్దార్లు ఆంజనేయులు, కృష్ణ తదితరులు ఉన్నారు.