సిరికొండ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల బిల్లుతో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ (MRPS ) జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్ ఆరోపించారు. నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకుల ఆధ్వర్యంలో డప్పుల ప్రదర్శన నిర్వహించారు.
తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు జనాభా ప్రతిపాదికన ఇవ్వవలసిన రిజర్వేషన్లలో ( Reservations) అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. 33 లక్షల జనాభా కలిగిన మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ రావాల్సి ఉండగా రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లులో 9 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, దీనిని తీవ్రంగా వ్యతిరికేస్తున్నామని అన్నారు.
గత మూడు దశాబ్దాలుగా మాదిగలు విద్య, ఉద్యోగ, రాజకీయంగా తీవ్రంగా నష్టపోయామని ఆరోపించారు. ఆధిపత్య పోరులో మాలలు ముందుకు పోయారని, తమకు ఇచ్చే రిజర్వేషన్లు రెండు శాతం తగ్గించడం అన్యాయమని అన్నారు. అత్యధిక జనాభా కలిగిన మాదిగలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గంలో చోటు లేదని తెలిపారు .
మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేయడం చేశారు. డాక్టర్ షమీమ్ అక్తర్ ఇచ్చిన నివేదికలో లోపాలను సవరించి ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దీపక్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్, బోడ గణేష్, మండల మాదిగ నాయకులు పాల్గొన్నారు.