ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మున్సిపల్ అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీకి సంబంధించి కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే మొదలు కానుండగా, మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశమున్నది. తక్కువ ఓట్లు పడ్డ వార్డులు/ డివిజన్ల రిజల్ట్ అంతకంటే ముందే వచ్చే చాన్స్ ఉన్నది. వార్డులు/ డివిజన్ల వారీగా టేబుళ్లు వేసి ఓట్లు లెక్కించనుండగా, అందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా, అభ్యర్థులు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. బ్యాలెట్లు తెరిస్తే ఫలితం ఎలా ఉంటుందోనన్న టెన్షన్ పట్టుకున్నది.
కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 12 : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఐదు మున్సిపాలిటీల ఓట్లను జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ చేయనుండగా, మిగతా వాటికి సంబంధించి మాత్రం ఆయా బల్దియాల్లోనే ఓట్లు లెక్కింపు చేయనుననారు. అన్నిచోట్లా వార్డులు/ డివిజన్ల వారీగా టేబుళ్లు సిద్ధం చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి పక్కన పెట్టనున్నారు. ఉదయం 8గంటల నుంచి బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టనున్నారు. అనంతరం 100 ఓట్లు అంటే.. నాలుగు కట్టలు తీసుకొని, అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను వేరు చేస్తారు. అలా వెయ్యి ఓట్ల వరకు అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను వేరు చేయనున్నారు.

అనంతరం ఈ వెయ్యి ఓట్ల లెక్కలు తీసి, దానిని ఒక రౌండ్‌గా పరిగణించి ఫలితాలను ప్రకటిస్తారు. అలా పూర్తి ఓట్లను లెక్కించిన అనంతరం పోస్టల్ బ్యాలెట్లను కూడా కలిపి తుది ఫలితాన్ని ప్రకటించనున్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూపర్‌వైజర్‌తోపాటు ఇద్దరు సహాయకులు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ఏదైనా వార్డులో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో విజేతను ప్రకటించనున్నారు. కాగా, కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అనుమతి పత్రాలు ఉన్న వారిని మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తారు. విజేతలు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు తీయడానికి అనుమతి లేదని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. 16న మేయర్/ చైర్మన్‌తోపాటు డిప్యూటీ మేయర్/ వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు.
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 12 : సిరిసిల్ల మున్సిపల్ కౌంటింగ్ కేంద్రంలో విచిత్ర సన్నివేశం నెలకొంది. స్థానిక సినారె కళామందిరంలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో కోతుల బెడద ఎకువగా ఉండడంతో అధికారులు పరిసరాలలో కొండెంగ ఫొటోల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం ఆవరణలోకి కోతులు రావడంతో అధికారులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. దీంతో సమస్య పరిషారం కోసం కొండెంగ చిత్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
