Nizamabad | నిజామాబాద్ : క్రికెట్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడికి అద్భుత అవకాశం దక్కింది. రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీల్లో ఇప్పటికే ప్రతిభ చాటుతున్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నేపల్లి గ్రామానికి చెందిన చిన్నుగారి రుత్విక్ రావుకు ప్రతిష్టాత్మక టీజీ టీ-20కి ఎంపికయ్యాడు. బౌలర్ గా రాణిస్తోన్న రుత్విక్ రావును అనురాగ్ నల్గొండ నైట్స్ జట్టు కొనుగోలు చేసింది. చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే ఎంతో మక్కువతో బౌలర్ గా సన్నద్ధమయ్యేవాడని ఇప్పుడు ప్రతిష్టాత్మకైన ఈవెంట్ కు ఎంపిక కావడం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ తరహాలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించబోతున్న టీజీ టీ20లో రుత్విక్ అద్భుతమైన ప్రదర్శన అందించి నిజామాబాద్ జిల్లాకు పేరు తీసుకు రావాలని జన్నేపల్లి గ్రామస్తులు అభిలాషిస్తున్నారు. రానున్న కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ మెరుగైన ప్రతిభతో తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకు రావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు.