ఖలీల్‌వాడి, డిసెంబర్ 6 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని నిజామాబాద్ అర్బన్ తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలు అర్బన్ ఎమ్మెల్యేగా తనకు ప్రజలు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన తొమ్మిదన్నరేండ్లలో నూతన కలెక్టరేట్, ఐటీ హబ్, మినీ ట్యాంక్‌బండ్, రైల్వే వంతెన, వైకుంఠధామాలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, డివైడర్లు, స్పైరల్ లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుల సంఘాలను గౌరవిస్తూ కులమతాలకతీతంగా భవనాల నిర్మాణం కోసం సీడీపీ నిధుల నుంచి కోట్ల రూపాయలు మంజూరు చేశానని తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, కరోనా విపత్కర సమయంలో, భారీ వర్షాలు కురిసినప్పుడు వారికి అండగా ఉంటూ ఉచితంగా భోజన వసతి కల్పించినట్లు చెప్పారు. అర్హులైన వారికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి వారికి భరోసా ఇచ్చానన్నారు. తెలంగాణ సాధనలో భాగంగా కేసీఆర్ పిలుపు మేరకు గల్లీ, ఢిల్లీలో ఉద్యమంలో పని చేశానని తెలిపారు. 2009లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా కూడా ప్రజలు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నానని పేర్కొన్నారు. సేవ చేయాలనే సంకల్పానికి ఎటువంటి పదవి అవసరం లేదన్నా రు. ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా సోదరుడిలా అం డగా ఉంటానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ఎ.అలీం, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మీర్ మజాజ్అలీ, నవీద్ ఇక్బాల్, సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, సిర్ప రాజు, ఎనుగందుల మురళి, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.