నిజామాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పినా, నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకూ ఏ ఒక్క అర్హుడిని గుర్తించలేదు. గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖల మధ్య సమన్వయం కొరవడంతో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందడంలేదు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా సర్కారు పెద్దలు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మహిళా సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఆ దిశగా ఇప్పటి వరకు ఒక్క అడుగుముందుకు పడకపోవడం గమనార్హం. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు పనులు చేపట్టేందుకు ముందుకురావడంలేదు. అప్పు చేసి ఇల్లు కట్టుకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతామని వారంతా ఆందోళన చెందుతున్నారు.
సర్కారు చెప్పినట్లుగా మొదటి విడుత లబ్ధిదారులకు రూ.50వేల వరకు సాయం అందుతుందని ఆశ పడుతున్నారు. సర్కారు చెబుతున్నట్లుగా సాయం రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమాఖ్య, స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.50వేలు నుంచి రూ.లక్ష ఇప్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం రుణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు కానరావడం లేదు. ఆర్థిక సాయం అవసరం ఉన్న వారికి దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 3లక్షల 32వేల 663 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొదటి విడుతలో 2807 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. రుణం కోసం ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నప్పటికీ పట్టించుకునే వారు కరువయ్యారు. కామారెడ్డి జిల్లాలో మొదటి విడుతగా మండలానికి ఒక గ్రామం చొప్పున 22 గ్రామాలకు 1719 ఇండ్లు మంజూరవగా రుణాలు మంజూరు కాలేదని తెలుస్తున్నది. రెండో విడుత లబ్ధిదారుల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ సంఖ్యను కలుపుకొంటే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఎదురు చూసే వారి సంఖ్య భారీగా పెరుగనున్నది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ, హౌసింగ్ శాఖల మధ్య సమన్వయం లోపించింది. రాజీవ్ యువ వికాసం పథకానికి డీఆర్డీవోలు సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు. రోజువారీగా కార్యక్రమాల్లోనూ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తలామునకలయ్యారు. తీరా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల రుణాలపై దృష్టి సారించలేకపోతున్నారు. లబ్ధిదారుల్లో కొంత మంది ఇప్పటికీ రుణాలు స్వీకరించని వారున్నారు. కొంత మందికి మహిళా సంఘాల్లో సభ్యత్వం లేదు. ఇలాంటి సాంకేతికపరమైన అంశాలు కూడా అధికారులకు తలనొప్పిగా మారాయి. ఇందిరమ్మ ఇండ్లకు రుణాలు మంజూరవుతాయని ప్రచారం చేస్తుండడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. తీరా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనలతో సతమతమవుతున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ దశలకు అనుగుణంగా రూ.5లక్షలను ప్రభుత్వం అందజేయనున్నది. ఆర్థిక ఇబ్బందులు కారణంగా పనులు ప్రారంభించలేని లబ్ధిదారులకు రుణాలు ఇప్పించి చేయూతను అందించాలని సర్కారు ఆలోచించినప్పటికీ, ఆ దిశగా ప్రత్యేక దృష్టిసారించడం లేదు. ఆయా దశల్లో పనులు నిలిచి పోకుండా రుణాలు ఇప్పించి పునాదుల తవ్వకం, ఇసుక, సిమెంట్, సలాక వంటి మెటీరియల్, మేస్త్రి తదితర వాటికి లోన్ డబ్బులను వినియోగించుకోవాల్సి ఉంటుంది.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రుణాల మంజూరుపై గ్రామీణాభివృద్ధి శాఖ సంబంధీకులు పరిశీలన చేస్తున్నారు. మేము క్షేత్ర స్థాయిలో అర్హులైన వారికి అవగాహన కల్పిస్తున్నాం.
– ప్రభు, పీడీ, హౌసింగ్ శాఖ,నిజామాబాద్ జిల్లా