కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం జిల్లాలో నీరుగారుతున్నది. ఈ పథకం అమలుపై లబ్ధిదారులు కూడా ఆసక్తి చూపడంలేదు. ఫలితంగా మంజూరైన ఇండ్లకు తగ్గట్లుగా నిర్మాణాలు జరగడంలేదు. ఇందుకు ఒకవైపు ప్రభుత్వం విధించిన నిబంధనలు కాగా.. మరోవైపు లబ్ధిదారుల వద్ద పెట్టుబడి లేకపోవడం కారణంగా తెలుస్తున్నది. పథకాన్ని ప్రారంభించి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ మంజూరైన ఇండ్లలో సగాని కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులు పనులు ప్రారంభించలేదు. ఇప్పటి వరకు 31 గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించి వారికి, ఇండ్లను మంజూరు చేశారు.
ఆర్థిక సంవత్సరం ముగింపులోపే ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినా, ఇప్పటి వరకు పునాది తీసేందుకు కూడా ముందుకు రావడం లేదు. ప్రతి ఇంటికీ రూ.5లక్షలు మంజూరు చేసి, ఐదు విడుతల్లో ఆర్థిక సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పటికీ, ఇండ్ల నిర్మాణాల్లో వేగం పుంజుకోవడం లేదు. ఇండ్ల కోసం ముగ్గులు పోసేందుకు చూపిన ఉత్సాహం.. నిర్మాణానికి వచ్చే సరికి కనిపించడం లేదు.
-నిజామాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడుత కింద నిజామాబాద్ జిల్లాలో 31 గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల పరిధిలో మొత్తం 2,762 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. వీరందరికీ ఇండ్లను మంజూరు చేయడంతోపాటు వారి సొంత స్థలాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఇండ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ఇతర గ్రామాల్లో మంజూరు చేసి పనులు చేపట్టాలని భావిస్తున్నారు. కానీ 31 గ్రామాల్లో ఇప్పటి వరకు కేవలం 440 ఇండ్ల నిర్మాణాల కోసం లబ్ధిదారులు ముగ్గులు పోసుకుని పునాది పనులు చేపడుతున్నారు. వీటిలో 170 ఇండ్లు బేస్మెంట్ స్థాయిలో పూర్తి కాగా, వాటి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
మొదటి విడుత నిధులను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు సైతం చేస్తున్నట్లు హౌసింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5లక్షలు మంజూరు చేస్తున్నది, ఇండ్ల నిర్మాణం ఆధారంగా ఐదు విడుతల్లో ఈ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. బేస్మెంట్ స్థాయిలో రూ.లక్ష, లెంటల్ స్థాయిలో రూ. లక్ష, రూఫ్ స్థాయిలో రూ.లక్ష, స్లాబ్ స్థాయిలో రూ.లక్ష, ఇండ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత చివరి పేమెంట్‌గా రూ.లక్ష చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. మొత్తం ఐదు విడుతల్లో నిధులను మంజూరు చేస్తారు. ఎంపిక చేసిన గ్రామాల వారీగా మంజూరైన మొత్తం ఇండ్లతో, పనులు మొదలైన ఇండ్ల సంఖ్యను పోల్చుకుంటే చాలా తక్కువ స్థాయిలోనే నిర్మాణాలు నత్తనడకన కొనసాగుతున్నట్లుగా కనిపిస్తున్నది.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇటుక, సిమెంట్, ఇసుక, ఇను ము వంటివేవి గృహ నిర్మాణ శాఖ సరఫరా చేయడం లేదు. అందుబాటులో లభించే ఇసుకను మాత్రమే ఉచితంగా తెచ్చుకునేందుకు అనుమతులను మంజూరు చేస్తున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ఇండ్ల నిర్మాణానికి ఆయా మండలాల తహసీల్దార్లు ఇసుక కోసం అనుమతులను మంజూరు చేస్తున్నారు. ఇదే అదనుగా కొందరు తహసీల్దార్లు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేరిట జేబులు నింపుకుంటున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదు. ఇండ్లను 400 చదరపు అడుగులలోపు నిర్మాణం చేపట్టాలి. నిర్మాణ సమయంలో బేస్మెంట్ వరకే పిల్లర్లు వేయాలి. తొమ్మిది పిల్లర్లను మాత్రమే వేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. కొంత మంది లబ్ధిదారులు మాత్రం పిల్లర్లను స్లాబ్ వరకు వేస్తుండగా మరికొంత మంది బేస్మెంట్ వరకే వేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం రూ.5లక్షలకే మోడల్ ఇండ్లకు ఖర్చు అవుతున్నట్లుగా వివరిస్తున్నారు.
వాస్తవంగా పరిశీలిస్తే అదనంగా భారం పడే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఒక్కో ఇంటికి అదనంగా రూ.2లక్షలు నుంచి రూ.3లక్షల వరకు భారం మోయాల్సి వస్తున్నది. లబ్ధిదారుల ఎంపిక సమయంలో నిబంధనల మేరకే ఇండ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులు సూచించారు. లబ్ధిదారులు మాత్రం కొన్ని చోట్ల స్థలం ఎక్కువగా ఉండడంతో తమకు అనుకూలంగా ఇండ్ల నిర్మాణం చేపట్టారు. గ్రామాల్లో 100 నుంచి 200 గజాల కన్నా ఎక్కువ స్థలం ఉన్న వారున్నారు. 400 చదరపు అడుగులలోనే ఇల్లు కట్టుకోవాలంటే చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కనీసం వెయ్యి నుంచి 1200 చదరపు అడుగుల వరకు ఇల్లు నిర్మించుకునే ఆలోచనలో చాలా మంది ఉన్నారు.