నాగిరెడ్డిపేట, నవంబర్ 13 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇంటిని మంజూరు చేయగా.. ఇల్లు మొత్తం నిర్మించుకున్నా ఒక్క బిల్లు కూడా రాకపోవడంతో ఓ మహిళ వినూత్న నిరసనకు దిగింది. ‘ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నాను. ఇప్పటికీ ఒక్క బిల్లు ఇవ్వలేదు. దయచేసి అధికారులు, నాయకులు ఇంటి బిల్లును ఇప్పించమని ప్రార్థన’ అంటూ సదరు మహిళ ఇంటి స్లాబు కు ఫ్లెక్సీని కట్టి నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇంటిని మంజూరు చేయడంతో సంతోషంతో బంగారం అమ్ముకొని, కూతుళ్ల బంగారం కుదువపెట్టి ఇంటి నిర్మాణం చేపట్టినా ఇప్పటివరకు ఒక్క రూపాయి బిల్లు కూడా ఇవ్వడం లేదని సదరు మహిళ వాపోయింది. ఈ ఘటన నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లి గ్రామం పంచాయతీలో చోటుచేసుకున్నది.
గ్రామానికి చెందిన మంగళి ఈశ్వరమ్మ భర్త చనిపోవడంతో గ్రామంలో ఒంటరిగా ఉంటున్నది. ఇద్దరి కూతుర్లకు కష్టపడి పెండ్లి చేసింది. ఇల్లు లేకపోవడంతో ఇందిరమ్మ పథకానికి దరఖాస్తు చేసుకోగా.. మొదటి విడుతలో ఇంటిని మంజూరు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టింది. స్లాబ్ పనులు పూర్తి అయినా బిల్లు రాకపోవడంతో పలుమార్లు అధికారుల వద్దకు వెళ్లినా బిల్లులు ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బిల్లు వస్తుందన్న ఆశతో తన వద్ద ఉన్న రూ. 2.50 లక్షలు, గ్రామ మహిళ సంఘం ద్వారా తీసుకున్న రూ.2 లక్షల అప్పు తో పాటు తన కూతురు నుంచి బంగారం తీసుకువచ్చి కుదువ పెట్టి ఇంటి నిర్మాణం పూర్తి చేయించినట్లు తెలిపింది.
అధికారులకు విన్నవించినా బిల్లు రాకపోవడం, ఎవరూ స్పందించకపోవడంతో చేసేదేమీ లేక ఇంటికి ఫ్లెక్సీ కట్టి నిరసన తెలుపుతున్నానని చెప్పింది. అధికారులు తనకు ఇంటి బిల్లు అందించి ఆదుకోవాలని ఈశ్వరమ్మ కోరుతున్నది. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి కిష్టయ్యను వివరణ అడుగగా.. ఈశ్వరమ్మకు మొదటి విడుతలో ఇల్లు మంజూరైంది వాస్తవమేనని, ఇందిరమ్మ కమిటీ, అధికారులు కలిసి ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసినట్లు చెప్పారు. ఎంపిక చేసిన స్థలంలో కాకుండా పక్కనే ఉన్న స్థలంలో బేస్మెంట్పై ఇంటి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. సాంకేతిక ఇబ్బందులు కారణంగా ఆమెకు బిల్లులు మంజూరు కాలేదని ఆయన చెప్పారు.