బాలికకు భద్రత కరువైంది. అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పసి మనసులకు పెనుగాయాలు చేస్తున్న సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఆరు ఉదంతాలు చోటు చేసుకోవడం కలవరపాటుకు గురి చేస్తున్నది. పసితనంపై పైశాచికత్వం ఏ విధంగా కోరలు చాస్తున్నదో చాటి చెబుతున్నది.
మాయ మాటలు చెప్పి చిన్నారులను చిదిమేస్తున్నారు. ముద్దలొలికే మాటలతో పైకి కపట ప్రేమను నటిస్తూ కాటేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల జరిగిన దారుణాలు చూస్తే పరిస్థితి ఏ విధంగా దిగజారిందో అర్థమవుతుంది. ప్రజా పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిన వైనం కళ్లకు కడుతున్నది. జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు.. అంటే కేవలం పక్షం రోజుల్లోనే ఆరుగురు బాలికలు అన్యాయానికి గురయ్యారు. మృగాళ్ల చేతిలో నలిగి పోయారు. తాజాగా బోధన్‌లో ఏకంగా ఓ కౌన్సిలర్ కూడా వక్రబుద్ధి ప్రదర్శించి బాలికను నమ్మించి వంచించాడు. ప్రజాభద్రత పట్టని పాలకులు, సీరియస్‌గా స్పందించని పోలీసులు, కోరల్లేని చట్టాలు.. వెరసి బాలిక భద్రతకు, బంగారు భవిష్యత్తుకు పెను ముప్పుగా పరిణమించాయి.
– వినాయక్‌నగర్, ఆగస్టు 6
ఎన్ని చట్టాలు తెచ్చినా బాలికలు, చిన్నారులపై లైంగికదాడులు, లైంగిక దాడి యత్నాలు ఆగడం లేదు. అఘాయిత్యాల నివారణకు పోక్సో చట్టం తెచ్చినా కామాంధుల తీరుమారడం లేదు. జిల్లాలో పోక్సో కేసుల నమోదు సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వారం, పదిహేను రోజుల్లోనే బాలికలపై లైంగికదాడికి పాల్పడిన కేసులు నాలుగు నమోదవడం కలకలం రేపుతున్నది. నిజామాబాద్ నగరంలో మైనర్లనే లక్ష్యంగా చేసుకుంటున్న కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు చిన్నారులపై దాష్టీకానికి పాల్పడుతున్న ఘటనలు కలిచివేస్తున్నాయి. చాక్లెట్ ఆశ చూపుతూ.. మాయమాటలు చెబుతూ బాలికలపై లైంగికదాడులకు పాల్పడుతున్నారీ మానవమృగాళ్లు. పదిహేను రోజుల్లో వరుసగా చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతుండడంతో తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించడంతోనే ఇలాంటి నేరాలు పెరిగిపోతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జూలై 20న
నగరంలోని మూడో టౌన్ పరిధిలో ఇంటర్ చదివే బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడో కామాంధుడు. పెండ్లయి ఇద్దరు సంతానం ఉన్నప్పటికీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనకు జరిగిన అన్యాయాన్ని బాలిక కుటుంబీకులతో చెప్పడంతో విషయం బయటికి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
జూలై 30న
నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఐదేండ్ల చిన్నారి ఇంటి ఎదుట ఒంటరిగా ఆడుకుంటుండగా ఓ కామాంధుడు చాక్లెట్ ఆశ చూపించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనపై జరిగిన దారుణాన్ని ఆ చిట్టితల్లి కన్నవారితో చెప్పుకోలేక రెండు రోజులపాటు బాధను భరిస్తూ వచ్చింది. చివరికి ఇబ్బందిని తట్టుకొలేక కన్న తల్లికి చెప్పడంతో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.
ఆగస్టు 2న
మూడోటౌన్ పోలీస్ స్టేషన్లో మరో లైంగికదాడి కేసు నమోదయ్యింది. జూలై 30న నగరంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్న ఓ యువకుడు మాయమాటలు చెప్పి హైదరాబాద్‌కు రప్పించుకున్నాడు. యువకుడిని నమ్మి వెళ్లిన విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధితురాలిని గుర్తించి నగరానికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఆగస్టు 2న
నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ షోరూంలో పనిచేస్తున్న బాలికను అదే సంస్థలో పనిచేసే ఓ యువకుడు ప్రేమపేరుతో లొంగదీసుకొని దారుణానికి ఒడిగట్టాడు. కొన్ని రోజుల తర్వాత విషయం బాలిక ఇంట్లో వారికి తెలియడంతో కూతురికి జరిగిన అన్యాయంపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెల 2న నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు.
ఆగస్టు 2న
బాన్సువాడ మండలం బోర్లం రోడ్డులో ఈ నెల 2న ఓ యువకుడు తొమ్మిదేండ్ల బాలికపై లైంగికదాడికి యత్నించాడు. నిందితుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.