ఎవుసం సాగేదెలా?
వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతాంగంపై ధరల మోత మోగుతున్నది. ఇటు ఎరువులు, అటు విత్తనాల రేట్లు పెరగడంతో పెనుభారం పడుతున్నది. సీజన్ ఆరంభానికి ముందే విత్తనాలు, ఎరువుల ధరలకు రెక్కలు రావడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది.
- పెరిగిన విత్తన, ఎరువుల ధరలు
- రైతన్నపై మోయలేనిభారం
- ఆందోళనలో అన్నదాతలు
బాన్సువాడ, జూన్ 19 : వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతాంగంపై ధరల మోత మోగుతున్నది. ఇటు ఎరువులు, అటు విత్తనాల రేట్లు పెరగడంతో పెనుభారం పడుతున్నది. సీజన్ ఆరంభానికి ముందే విత్తనాలు, ఎరువుల ధరలకు రెక్కలు రావడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. జీలుగు వంటి విత్తనాల రేట్లు సైతం పెంచడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే యూరియా దొరకక, యా సంగికి సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాక అన్నదాతలు తీవ్రంగా సతమతమవుతున్నారు. ఇలాంటి తరుణంలో ధరల దరువు వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నది.
రూ.వెయ్యి బాదుడు..
వ్యవసాయ భూములు సారవంతంగా మారడానికి రైతులు వానకాలం ఆరంభంలో జీలుగు, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలు చల్లుతారు. అయితే, ఆయా విత్తనాల ధరలు భారీగా పెంచేశారని రైతులు చెబుతున్నారు. గతంలో 30 కిలోల జీలుగు బస్తా సబ్సిడీ పోనూ రూ.1350-1400 లోపే దొరికేదని, కానీ ప్రస్తుతం రూ.2455కు పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో బస్తాపై రూ.వెయ్యి భారం వేశారని మండిపడుతున్నారు.
ఎరువుల ధరలకు రెక్కలు..
మరోవైపు, పంటల సాగులో వినియోగించే రసాయన ఎరువుల ధరలు సైతం పెరగడం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నది. రకాన్ని బట్టి ఒక్క బస్తాపై భారీగా బాదారని రైతులు చెబుతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలకు రెక్కలొచ్చాయని, ఇలాగైతే పంటల సాగుకు పెట్టుబడి భారీగా పెరిగి పోతున్నదని వాపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రైతులు పండించే వరి సాగు చేస్తున్నారు. వరికి ఎక్కువగా యూరియా, కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తారు. అయితే, కాంగ్రెస్ సర్కారు వచ్చాక యూరియా కష్టాలు రెట్టింపయ్యాయి. రైతులకు సరిపడా యూరియా దొరకడమే గగనంగా మారింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభా వం కారణంగా రసాయన ఎరువుల ధరలు అమాం తం పెరిగి పోయాయి.
పెట్టుబడి తడిసి మోపెడు..
వానాకాలం పంటల సాగు ఇప్పటికే ప్రారంభమైంది. నీటి వసతి ఉన్న రైతులు మక్క, పసుపు, సోయా విత్తనాలు వేస్తున్నారు. బాన్సువాడ ప్రాంతంలో వరి నారుమళ్లు కూడా పోశారు. అయితే, పంటల సాగుకు పెట్టుబడి భారీగి పెరిగి పోతున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు, ఎరువుల ధరలు పెరగడం ఇబ్బందికరంగా మారింది. అదే సమయంలో డీజిల్ ధరలు పెరగడం అన్నదాతలపై ప్రభావం చూపుతున్నది. ట్రాక్టర్ యజమానులు ధరలు పెంచేయడం మరింత భారంగా మారింది. అదే సమయంలో ప్రభుత్వం నుంచి మద్దతు కరువవడం మరిన్ని ఇక్కట్లు తెచ్చిపెడుతున్నది. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోవడంతో పంటల సాగుకు పెట్టుబడి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు సాగు ఆరంభానికి ముందే ఠంచన్‌గా రైతులు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేవారు. ఆ డబ్బులతోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే వారు. కానీ రేవంత్ సర్కారు వచ్చాక పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఎగవేస్తుండడంతో కర్షకుల కష్టాలు రెట్టింపయ్యాయి.
ధరలు నియంత్రించాలి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా ఉండాలి కానీ, ఇబ్బందులు పెట్టేలా ఉండొద్దు. పెరుగుతున్న ధరల కారణంగా రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నారు. ఎరువులు, విత్తనాలు ధరలు విపరీతంగా పెరిగాయి. భూమిని సారవంతంగా చేసేందుకు వినియోగించే పచ్చిరొట్ట విత్తనాల ధరలు పెంచడం దారుణం. 30 కిలోల జీలుగ సంచి ధర రూ.వెయ్యి దాకా పెంచేశారు. యూరియా దొరకడమే లేదు. యాప్ తీసుకొచ్చి రైతులను రోడ్లపైకి తీసుకొచ్చారు. రైతుల విషయంలో ప్రభుత్వాలు పునరాలోచించాలి.
– కొమ్మినేని రాజేశ్, రైతునగర్
రైతులపై పెనుభారం..
అందరికీ అన్నం పెట్టే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. కానీ, రైతులు ఇప్పుడు సాగు చేయాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి సీజన్లో విత్తనాలు, ఎరువుల రేట్లు పెంచడంతో పెట్టుబడి పెరిగి పోతున్నది. కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా సాగింది. సీజన్ ఆరంభానికి ముందే పెట్టుబడి కోసం రైతుబంధు సాయం అందించారు. ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉంచారు. పంట కోసిన వెంటనే కొన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చాక రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఎరువులు దొరకట్లేదు. పంటలు కొనట్లేదు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఎరువులు, విత్తన ధరలను నియంత్రించాలి.
– దుద్దాల అంజిరెడ్డి, రైతుబంధు సమితి, కామారెడ్డి జిల్లా మాజీ కన్వీనర్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

