మోర్తాడ్, డిసెంబర్ 17: ఎవరు సీరియస్ అయితే మాకేంటి? రూ.లక్షల్లో ముడుపులు ముట్టజెప్పాం.. అంతకు రెట్టింపు సంపాదించాలి కదా? అందుకే ఎవరు చెప్పినా వెనక్కి తగ్గేదేలే.. ఇసుక తవ్వకాలు ఆపేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఇసుకాసరులు. మోర్తాడ్ మండలం గాండ్లపేట్ శివారులోని పెద్దవాగు నుంచి ఇసుక దోపిడీ ఆపడం లేదు. కలెక్టర్ సీరియస్ అయినా వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం తెల్లవారుజాము వరకూ వందల కొద్దీ ట్రిప్పుల ఇసుకను తరలించుకు పోయారు. పైగా ఈ ఇసుకను తహసీల్ కార్యాలయానికి పక్కనే ఉన్న వెంచర్లో డంప్ చేయడం గమనార్హం.
ఇసుక తవ్వకాల కోసం గాండ్లపేట్ వీడీసీకి రూ.18 లక్షలు, మోర్తాడ్ శివారులో డంప్ చేస్తున్నందుకు రూ.5 లక్షలు, అధికారులకు భారీగా ముడుపులు చెల్లించిన అధికార పార్టీ నేతలు చీకటి పడితే చాలు పెద్దవాగులో జేసీబీలు, ట్రాక్టర్లతో వాలిపోతున్నారు. జాతీయ రహదారి మీదుగానే తరలించుకు పోతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులను మచ్చిక చేసుకోవడంతో వారు పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించడం, కలెక్టర్ సీరియస్ కావడంతో కదిలిన రెవెన్యూ అధికారులు సోమవారం డంప్‌లు సీజ్ చేసినట్లు చూపించారు. కానీ, అదే రోజు రాత్రి మళ్లీ పెద్దవాగు నుంచి ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరిగాయి. మంగళవారం ఉదయం వరకూ తరలించిన ఇసుకను తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న వెంచర్లో డంప్ చేశారు. అయినా అటువైపు ఎవరూ కన్నెత్తి చూడలేదు.
గాండ్లపేట్ నుంచి అక్రమ తవ్వకాలు చేపట్టిన అధికారపార్టీ నాయకులు.. తక్కువ ధరకే ఇసుక విక్రయిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మేరకు గ్రామాల్లో ఉండే వాట్సప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. పైగా నియోజకవర్గ స్థాయి నేత ఆదేశాల మేరకే ఇసుక తరలింపు జరుగుతున్నదని అందులో పేర్కొనడం గమనార్హం. తక్కువ ధరకే ఇసుక అని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ.. వాస్తవానికి జరుగుతున్నది మరోలా ఉన్నది.
అక్రమంగా డంప్ చేస్తున్న ఇసుకను లారీల్లో పట్టణాలకు తరలించి అధిక ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాలకు లారీలో ఇసుక తరలిస్తూ ఇటీవలే పట్టుబడిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టి అక్రమ వ్యాపారం చేస్తూనే ప్రజలకేమో తక్కువ ధరకే ఇసుక అని కలరింగ్ ఇస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తరలిస్తూ భారీగా దండుకుంటున్నారు. మరోవైపు నీళ్ల నుంచే ఇసుక తోడేస్తుండడంతో జాతీయ రహదారి పూర్తిగా తడిసిపోయి ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.