సర్కారు బడుల అభివృద్ధియే లక్ష్యంగా పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మెరుగైన వసతులతో తయారయ్యాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పనులన్నీ పూర్తి చేసుకొని ఫిబ్రవరి 1న ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యంతోపాటు మరుగుదొడ్లు, హ్యాండ్‌వాష్, ఫ్లోరింగ్, గ్రీన్ బోర్డులను ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంతోపాటు లైబ్రరీ, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లను నిర్మించారు. ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలలు కొత్త రంగులద్దుకొని సుందరంగా తయారయ్యాయి.
బీర్కూర్, జనవరి 30: మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా బీర్కూర్ మండలంలో ఏడు పాఠశాలలను ఎంపిక చేసింది. మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాల అన్ని పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. ఈ పాఠశాలకు రూ.6.78లక్షలు కేటాయించగా మేజర్, మైనర్ మరమ్మతులు, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యాలు, సీలింగ్ ఫ్యాన్లు, గ్రీన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో మొత్తం 225 మంది విద్యార్థులు ఉండగా వారిలో 113 మంది బాలికలు, 112 మంది బాలురు, నలుగురు ఉపాధ్యాయులతో పాఠశాల కొనసాగుతుంది.
మా పాఠశాలను మన ఊరు- మన బడిలో ఎంపిక చేసి నూతన హంగులు కల్పించడంతోపాటు అదనపు గదులు నిర్మించడం ఎంతో సంతోషంగా ఉన్నది. ఇక తరగతి గదుల సమస్య ఉండదు. విశాలమైన తరగతి గదుల్లో శ్రద్ధగా పాఠం వినడానికి ఆస్కారం ఉంటుంది.
– సంజన, 5వ తరగతి, బీర్కూర్
వేల్పూర్, జనవరి 30: మండలంలోని రామన్నపేట, అంక్సాపూర్, కుకునూర్, పడగల్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు -మన బడి కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఇందులో భాగంగా మరుగుదొడ్లు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ఇతర మరమ్మతులు చేపట్టారు. రామన్నపేట్, పడగల్ పాఠశాలల్లో వందశాతం పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మిగతా పాఠశాలల్లో పనులు చివరి దశకు చేరుకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల బలోపేతం కోసం ఎంతో కృషి చేస్తున్నది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీర్చిదిద్దేందుకు చేపట్టిన మన ఊరు – మనబడి కార్యక్రమం చాలా బాగున్నది. మా పాఠశాలలో మౌలిక సదుపాయాలు, తరగతి గదులు ఎంతో మెరుగుపడ్డాయి.
– జమాలొద్దీన్, హెచ్ఎం, పడగల్ ప్రభుత్వ పాఠశాల
బాన్సువాడ రూరల్, జనవరి 30: బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 7.20లక్షల నిధులు మంజూరు చేసింది. భవనాలు, తరగతి గదులను పూర్తిగా ఆధునీకరించడంతో కార్పొరేట్ పాఠశాలగా రూపుదిద్దుకున్నది. తరగతి గదుల్లో విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనులు చేపట్టి విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కల్పించారు. పాఠశాల భవనాలకు రంగులు వేయించి సుందరంగా తీర్చిదిద్దారు.
భీమ్‌గల్,జనవరి 30: భీమ్‌గల్ మండలంలోని బెజ్జోరా మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ రూపురేఖలు మారాయి. మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా కేటాయించిన నిధులతో అన్ని సౌకర్యాలను కల్పించారు. తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లను ఏర్పాటు చేయడంతోపాటు పాఠశాల భవనానికి రంగులు వేయడంతో సరికొత్తగా మారింది.
రెంజల్, జనవరి 30 : రెంజల్ మండలంలో మొత్తం 29 పాఠశాలలు ఉండగా మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుత 9 పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో సాటాపూర్, బోర్గాం గ్రామాల పాఠశాలలను ఆదర్శ పాఠశాలల కింద ప్రకటించింది. సాటాపూర్‌లోని యూపీఎస్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో విద్యుత్ పనులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, మేజర్, మైనర్ పనులను ఏకకాలంలో పూర్తి చేశారు. గోడలకు పెయింటింగ్ వేయించడంతో తరగతి గదులు ఆద్దంలా మెరుస్తున్నాయి.
గతంలో అత్యవసరాలను తీర్చుకునేందుకు ఇంటికి వెళ్లేది. ప్రభుత్వం మన ఊరు – మన బడి కింద మా పాఠశాలలోని మరుగుదొడ్లను బాగుచేయడంతో సమస్యకు పరిష్కారమైంది. ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తగ్గకుండా వసతులు, సౌకర్యాలు కల్పించారు. కొత్తగా రంగులు వేయడంతో అద్దంలా మెరుస్తున్నాయి.
– షఫియాబేగం, 7వ తరగతి ఉర్దూ మీడియం పాఠశాల,సాటాపూర్
ఏర్గట్ల, జనవరి 30: మండలంలోని తడ్పాకల్ ఎంపీపీఎస్, గుమ్మిర్యాల్ ఎంపీపీఎస్, మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలతోపాటు ఎంపీపీఎస్ పాఠశాలను మన ఊరు – మనబడి కార్యక్రమానికి సర్కారు ఎంపిక చేసింది. అన్ని పాఠశాలల్లో పనులన్నీ పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఏర్గట్ల ఎంపీపీఎస్ పాఠశాలకు రూ.8.80లక్షలు మంజూరు కాగా భవనానికి చెందిన గోడల మరమ్మతులు, గేటును ఏర్పాటు చేశారు. అన్ని గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, నీటి నిల్వ కోసం సంప్, హ్యాండ్ వాష్, మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టారు.
చందూర్, జనవరి 30: చందూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ మండల పరిషత్ పాఠశాల మన ఊరు – మన బడి కార్యక్రమానికి ఎంపికైంది. ఇందులో భాగంగా రూ.4లక్షల42వేలను మంజూరు చేయగా పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దారు. మరుగుదొడ్లు, నీటి వసతి, హ్యాండ్ వాష్ సౌకర్యం కల్పించడంతోపాటు పాఠశాలకు కొత్తగా రంగులు వేశారు. విద్యుత్ సౌకర్యం కల్పించడంతోపాటు ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. గ్రీన్ బోర్డులను బిగించారు. చిన్నచిన్న మరమ్మతులు సైతం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు – మనబడి కార్యక్రమం ద్వారా మా పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు గదులను నిర్మిస్తూ సర్కారు పాఠశాలకు జీవం పోస్తున్నది.
– సిరాజుద్దీన్, హెచ్ఎం, చందూర్ పాఠశాల
కామారెడ్డి, జనవరి 30 : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో ఎందరో విద్యార్థులకు భరోసాను ఇస్తుందీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. 1983లో దేవునిపల్లిలోని మల్లన్న దేవాలయం పక్కన ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేశారు. 1991లో హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ అయింది. 2001లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో నిజాంసాగర్ రోడ్డు దేవునిపల్లిలో విశాలంగా పాఠశాలను ప్రారంభించారు. 2009లో ఇంగ్లిష్ మీడియం స్కూల్‌ను ప్రారంభించారు. 6 నుంచి 10వ తరగతి వరకు సుమారు 360మందితో సక్సెస్‌గా నడుస్తున్నది. మన ఊరు – మన బడి కార్యక్రమంతో మరింత బలపడింది. రూ.42,26,792 నిధులు విడుదల కావడంతో పాఠశాలను కార్పొరేట్‌కు దీటుగా అన్ని రకాల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. విశాలమైన మైదానం, తరగతి గదులు, డైనింగ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్‌లు, సైన్స్ ప్రాజెక్ట్ ల్యాబ్‌లు, గ్రంథాలయం, తాగునీరు, టాయిలెట్ల సౌకర్యం కల్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల మరింత అభివృద్ధి చెందింది. కార్పొరేట్ పాఠశాలలో ఉండే అనేక రకాల వసతులు, సౌకర్యాలు కల్పించారు. విశాలమైన తరగతి గదులు, విశాలమైన డైనింగ్ హాల్, మైదానంతో పాఠశాల అభివృద్ధి చెందింది.
-గంగాకిషన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
ప్రైవేటులో చదువుతున్నట్లుగా ఉన్నది..
మా పాఠశాలలో చదివితే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నట్లుగా ఉన్నది. మా ఉపాధ్యాయులు ప్రతి ఒక్క విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పాఠశాలలో కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు ఉన్నాయి. రోజూ స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు
– అనీల, విద్యార్థిని, పదోతరగతి
డిచ్పల్లి, జనవరి 30: డిచ్పల్లి మండలంలోని రాజారామ్ నగర్ ఇంగ్లిష్ మీడియం ప్రాథమిక పాఠశాల మన ఊరు – మనబడి కింద తొలి విడుతలో ఎంపికైంది. రూ.4లక్షల87వేల762 మంజూరు కావడంతో పాఠశాలలో పూర్తిస్థాయిలో విద్యుద్దీకరణ, తాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం 100 శాతం పనులు పూర్తయ్యాయి. తాగునీటి ట్యాంకును నిర్మించి నల్లాలు ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో చేతులను కడుక్కోవడానికి సౌకర్యంగా మారింది. మండలంలో మొదటి విడుతలో మొత్తం 22 పాఠశాలలను ఎంపిక చేశారు. మిగిలిన బడుల్లో పనులు చురుకుగా సాగుతున్నాయి.
గతంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఇంటి నుంచి బాటిళ్లలో తెచ్చుకున్న నీటిని తాగేవాళ్లం. ఇప్పుడు పాఠశాలలోనే శుద్ధమైన నీటిని అందించడంతో ఇబ్బందులు దూరమయ్యాయి. తిన్న తర్వాత చేతులు కడుక్కునేందుకు ప్రత్యేకంగా నల్లాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది.
-జూలి, విద్యార్థిని