నిజామాబాద్, అక్టోబర్ 1, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో రిజర్వేషన్ అమలు కీలకమైంది. ప్రభుత్వ విధివిధానాల మేరకు రిజర్వుడు స్థానాలుగా నిర్ణయించడం అధికార యంత్రాం గం చేతిలోని పని. అందుకు విరుద్ధంగా చిత్ర, విచిత్రాలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రిజర్వేషన్ కేటాయింపులు జరగడం స్థానిక ప్రజలను గందరగోళానికి గురి చేస్తోంది. ఓటర్లు లేని ప్రాంతంలో సర్పంచ్‌గా ఎవరు పోటీ చేస్తారని? ప్రశ్నిస్తుండగా అధికారులు నోరు మెదపడం లేదు. ఈ లోపాలకు బాధ్యులు ఎవరు? అని అడిగితే స్పందించే వారు కరువయ్యారు.
ఈ రిజర్వేషన్ గందరగోళానికి ఫుల్స్టాప్ పెట్టాల్సిన జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. అక్టోబర్ 8న హైకోర్టులో బీసీ రిజర్వేషన్ అంశంపై విచారణ ఉంది. ఈ అం శంలో రాష్ట్ర అత్యున్నత న్యా యస్థానం కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నా యి. తదనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కేటాయింపుల్లో తిరిగి మార్పులు, చేర్పులు జరుగుతాయా? అన్నది ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఒక వేళా మార్పులు జరిగితే ఓటర్లు లేని చోట ఇతర సామాజిక వర్గాలకు కేటాయించిన రిజర్వుడు స్థానాలను మార్చుతారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల ఈ తరహా లోపాలు బహిర్గతం కావడంతో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం నిర్లీప్తతను తేటతెల్లం చేస్తోంది.
నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తండాలో అత్యధికంగా గిరిజన జనాభా నివసిస్తోంది. ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒకే కుటుంబం నివాసం ఉంటుంది. మొన్నటి రిజర్వేషన్ల కేటాయింపులో బీసీకి ఈ తండాను కేటాయించడంతో గిరిజనులు మండిపడుతున్నారు. 99 శాతం మంది గిరిజనులు నివసిస్తున్న తండాకు బీసీకి ఎలా కేటాయిస్తారని అడుగుతున్నారు. తమకు సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశాన్ని దూరం చేశారంటూ మండిపడుతున్నారు.
తండాలో 1700 ఓటర్లు ఉన్నారు. గతంలోనూ ఇదే రకంగా బీసీకి రిజర్వేషన్ అమలు చేయగా వడ్ల విఠల్ అనే వ్యక్తిని ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. తాజాగా మరోసారి రిజర్వేషన్ రిపీట్ కావడంతో గిరిజనులంతా అవాక్కుతింటున్నారు. వడ్ల విఠల్ తిరిగి సర్పంచ్‌గా ఎన్నికయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వడ్డెరగూడెం తండాలో అంతా బీసీలే నివసిస్తున్నారు. వడ్డెర కులానికి చెందిన వారే ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. సర్పంచ్‌గా ఈ గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ వర్తించింది. ఇదేంటని అడిగితే అధికారులు ఎవ్వరూ సమాధానం ఇవ్వడం లేదు.
వడ్డెరగూడెం తండాలో ఎస్టీ ఓటర్లు లేరు. బీసీలే ఓటర్లుగా ఉన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో అంకోల్ గ్రామం ఉంది. ఈ గ్రామంలో గిరిజనులే లేరు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలే నివసిస్తున్నారు. కానీ సర్పంచ్ పోస్ట్ ఎస్టీలకు కేటాయించారు. ఈ గందరగోళాన్ని సరి చేస్తారా? లేదా? అని అంకోల్ ప్రజలంతా అడుగుతున్నారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని చావుని తండా ఎస్సీలకు రిజర్వేషన్ కేటాయించారు. నాలుగు వార్డులు బీసీలు, నాలుగు వార్డులు ఎస్సీలకు కేటాయించారు. కానీ చావుని తండాలో ఎస్సీలు ఒక్కరూ లేరు. మథుర లంబాడాలు బీసీ(డి)లుగా కొనసాగుతున్నారు. కానీ వీరికి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడం వింతగా మారింది. చావునితండాలో 306 మంది ఓటర్లున్నారు. పురుషులు 146, స్త్రీలు 160 మంది ఉన్నారు.
సర్పంచ్ స్థానానికి పోటీ చేయడం వీలు కాని పక్షంలో అక్కడ ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం అవుతోంది. ఆ సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకునే వీలుందని తెలుస్తోంది. సర్పంచ్‌కు అర్హులు లేని చోట వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతాయి. వార్డు మెంబర్ల మద్ధతుతో గెలిచే ఉప సర్పంచ్ చేతిలో గ్రామ పంచాయతీ పరిపాలనను కొనసాగిస్తారు. జరిగిన పొరపాటును మాత్రం సరి చేయడం కుదరదు. 6 నెలలు గడిచిన తర్వాత రిజర్వేషన్‌ను మార్చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించే వీలుంటుంది.
ఉప సర్పంచ్ నియమితులైన తర్వాత ఆరు నెలల్లో ఎవరైనా సంబంధిత సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఆయా గ్రామాల్లో చేరితే వారికే పదవి వరిస్తుంది. ఇదంతా సాంకేతికపరమైన అంశాలతో కూడి ఉన్నందున రిజర్వేషన్ లోపాలు వెలుగు చూసిన గ్రామాల్లో సర్పంచ్ పదవి దాదాపుగా ఖాళీగానే ఉంటుంది. వారం రోజుల్లోనే హైకోర్టులో రిజర్వేషన్ అమలుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్లు మార్చే అవకాశం ఏర్పడితే ఏదైనా జరిగే వీలుంది. లేదంటే అంతే సంగతి అంటూ అధికార గణం చేతులు ఎత్తేస్తోంది.