సదాశివనగర్, ఆగస్టు 24 : పేదలు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో రూపాయికే కిలో చొప్పున ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. ప్రతినెలా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని స్థానిక కిరాణా షాపులవారు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి రైస్ మిల్లరకు విక్రయిస్తున్నారు. కొందరు రేషన్ డీలర్లే లబ్ధిదారుల నుంచి బియ్యం తీసుకొని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఈ దందాను పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు సదాశివనగర్, రామారెడ్డి, మాచారెడ్డి, రాజంపేట్, గాంధారి, బిచ్కుంద , తాడ్వాయి తదితర మండలాల్లో పీడీఎస్ బియ్యం తరలిస్తుండగా పోలీస్, రెవెన్యూ అధికారులు పట్టుకొని కేసులు నమోదు చేశారు. గత నెలలో రామారెడ్డి మండలం ఉప్పల్వాయికి చెందిన ఓ కిరణా వ్యాపారి రేషన్ బియ్యాన్ని వ్యాన్‌లో కామారెడ్డికి తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు.
మే నెలలో మెట్పల్లి నుంచి బాన్సువాడకు పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా సదాశివనగర్ మండలం పద్మాజివాడి ఎక్స్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో బియ్యం అక్రమ రవాణా బయటపడింది. మూడు నెలల క్రితం బిచ్కుంద మండల కేంద్రంలో రేషన్ బియ్యం విక్రయిస్తున్నవారిపై అధికారులు కేసులు నమోదు చేశారు. రెండు నెలల క్రితం బీర్కూర్ మండలకేంద్రం నుంచి బియ్యం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. గత నెలలో జుక్కల్ మండలంనుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న పీడీఎస్ బియ్యం వాహనాన్ని అధికారులు పట్టుకొని కేసులు నమోదు చేశారు. జూన్ 26న నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో లారీలో తరలిస్తున్న 265.15 క్వింటాళ్ల రేషన్ బియ్యం గుట్టు రట్టయ్యింది. జూలై 11న సదాశివనగర్ మండలం తిర్మన్పల్లిలోని కిరణాషాపులపై దాడులు నిర్వహించి 50 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. ఆగస్టు 15న రామారెడ్డి మండలం ఉప్పల్వాయి నుంచి కామారెడ్డికి 111 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆగస్టు 22న సదాశివనగర్ మండలం తిమ్మోజివాడి నుంచి గూడ్స్ వాహనంలో తరలిస్తున్న 15 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేశారు. తాడ్వాయి మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా లారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అక్రమాల్లో డీలర్ల పాత్ర..
రేషన్ బియ్యం అక్రమాల్లో డీలర్ల పాత్ర కూడా వెలుగు చూస్తున్నది. కొన్ని చోట్ల డీలర్లే బియ్యం వ్యాపారం చేస్తున్నారు. మూడు నెలల క్రితం రేషన్ షాపులో అక్రమంగా నిల్వ చేసిన బియ్యాన్ని అధికారులు పట్టుకుని సివిల్ సైప్లె గోదాముకు తరలించి డీలర్లపై కేసులు నమోదు చేశారు. అయినా అక్రమ దందాను మరువడం లేదు. అధికారులకు ముడుపులు చెల్లించి తిరిగి డీలర్షిప్ తీసుకుంటున్నారు. మూడు రోజుల క్రితం సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లిలో రెండు కిరణా షాపుల్లో ఎస్సై శేఖర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి 29 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు.
సదాశివనగర్ మండలంలో..
సదాశివనగర్ మండంలోని తిర్మన్‌పల్లి, సదాశివనగర్, కల్వరాల్, తిమ్మోజివాడి, పద్మాజివాడి, కుప్రియాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి, రామారెడ్డి మండలంలోని ఉప్పల్వాయి గ్రామాలకు చెందిన కిరణాషాపుల యజమానులే దళారులుగా మారి బియ్యం దందా చేస్తున్నారు. లబ్ధిదారుల ఇంటింటికీ తిరుగుతూ బియ్యం సేకరిస్తున్నారు. వాటిని పెద్దమొత్తంలో రైస్ మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమ దందాపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.