మోర్తాడ్, మే 31: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితంలేకుండా పోతున్నది. బాల్కొండ నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలంగా మొరం, ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లతో చేసేదేమీలేక అందిందే పదివేలు అన్నట్లు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఫ్రీగా ఇస్తామని అధికారపార్టీ నేతలు చెబుతున్నా..క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెండోరా మండలం వెల్కటూర్, ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామశివారులోని పెద్దవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా ఇందిరమ్మ ఇండ్ల పేరిట జోరుగా సాగుతున్నది. అడిగే వారు లేరు…పట్టించుకునే వారు అసలేలేరన్నట్లుగా మారింది పరిస్థితి. ఇసుక అక్రమ రవాణా గురించి సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకుడిపై కేసు నమోదు చేసిన ఘటన ఇటీవలే ముప్కాల్‌లో చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
ఇసుక పాయింట్లు ఏర్పాటు చేసే గ్రామకమిటీలకు ట్రాక్టర్‌కు రూ.50వేలు చెల్లించాల్సిందే. ఈ ఒప్పందం మేరకు ట్రాక్టర్‌కు రూ.50వేలు గ్రామకమిటీకి చెల్లించి ఇసుకను తీసుకెళ్తున్నారు. ఏడాది కాలంగా ఇదే తంతు కొనసాగుతున్నా ఈసారి మాత్రం కొంత మార్పు చేసుకున్నారు. వర్షాకాలం కావడంతో వర్షాలు కురిస్తే ఇసుకను తరలించడానికి అవకాశం ఉండదు. దీంతో అక్టోబర్ వరకు 34 సార్లు ట్రాక్టర్‌కు రూ.50వేలు చెల్లించాలనే నిబంధన విధించుకున్నట్లు తెలిసింది.
ఇటీవల బట్టాపూర్లో ఓ నాయకుడు అదనంగా ఒక ట్రిప్పు ట్రాక్టర్ ఇసుకను తరలించగా.. గ్రామకమిటీ రూ.లక్ష జరిమానా విధించినట్లు సమాచారం. గ్రామ కమిటీకే డబ్బులు చెల్లిస్తున్న ఇసుకాసురులు..ఇక అధికారులకు చెల్లించరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నవారి కోసం అంటూ ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. జేసీబీలతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారంటే పరిస్థితి ఏంటో అర్ధమవుతున్నది. నియోజకవర్గంలో చాలాచోట్ల ఇసుక డంపులు కనిపిస్తున్నాయి. అయినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.