భీమ్‌గల్, జనవరి 23: మండలంలో ఇసుక దందాకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళ అందినకాడికి దోచుకుపోతున్నారు. అధికారంలోకి వచ్చిందే ఆలస్యం మండలంలోని కప్పలవాగుపై నాయకులు దండయాత్ర చేస్తున్నారు. మండలంలో ఇసుక లభించే ప్రాంతాలు కనిపిస్తే చాలు తవ్వుకుంటున్నారు. మొన్నటి వరకు బడాభీమ్‌గల్, తర్వాత భీమ్‌గల్, అనంతరం సికింద్రాపూర్, తాజాగా బెజ్జోరా వాగులో ఇసుక తవ్వకాలు చేపట్టిన అక్రమార్కులు ఇప్పుడు మండలంలోని గోన్‌గొప్పుల్ వాగులోకి ప్రవేశించారు.
విడుతల వారీగా అడ్డాలు మారుస్తూ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. వీరికి నాయకులు, అధికార యంత్రాంగం వత్తాసు పలుకుతుండడం గమనార్హం. ఇటీవల గ్రామంలో ఉన్న కప్పల వాగు నుంచి ఇసుక తవ్వకాలకు అక్రమార్కులు స్థానిక గ్రామ కమిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం మూడు రోజుల క్రితం అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో వాగులోకి ప్రవేశించి ఇసుకను గ్రామ శివారులోని హైస్కూల్ పక్కన డంపు చేశారు. అక్కడి నుంచి లారీలు, టారస్ బండ్లలో పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఈ విషయమై గ్రామంలో కొందరు డయల్ 100 నంబర్‌కు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చి వెళ్లిపోయారు. కానీ దోపిడీ షరా మామూలే. మున్సిపల్ ఎన్నికల హడావుడిలో పార్టీలు, నాయకులు ఉండగా రహస్యంగా ఇసుకను తరలించడం అక్రమార్కుల వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. మళ్లీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి తిరిగి గురువారం రాత్రి ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. అయినా అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహిరించడం గమనార్హం.
గతంలో రెండు మూడు రోజులు పెద్ద మొత్తంలో ఇసుకను డంపులు చేసి ఒకేసారి లారీలు, టారస్ బండ్లలో పట్టణ ప్రాంతాలకు తరలించేవారు. భారీ ఇసుక డంపులతో ప్రజల కండ్లలోకి వస్తున్నామని భావించిన ఇసుకాసురులు, ఈ సారి కొత్త ఎత్తుగడ వేశారు. ముందుగానే నిర్ణయించిన స్థలంలో టారస్ బండ్లు, లారీలు సిద్ధంగా ఉంచి, వచ్చిన ఇసుకను వచ్చినట్లు జేసీబీ సాయంతో భారీ వాహనాల్లో నింపుతున్నారు. దీంతో తెల్లవారే సరికి ఖాళీ మైదానం దర్శనమిస్తుంది. ఎవరైనా దాడులు, తనిఖీలు చేసినా అక్కడ ఏమీ కనిపించకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో నాయకుల మద్దతుతోనే ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. గ్రామాలకు ఆదాయం ఆశ చూపించి, వీడీసీల పేరుతో గ్రామస్తుల నోరు నొక్కేస్తున్నారు. ఇసుక దోపిడీని అరికట్టి, సహజ వనరులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.