మోర్తాడ్/ఏర్గట్ల, మార్చి 10: బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక దందా ఆగడంలేదు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఇసుక అక్రమ రవాణా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు. భీమ్గల్ మండలం బడాభీమ్గల్ వాగు, ఏర్గట్ల మండలం బట్టాపూర్ పెద్దవాగులో ఇసుక తవ్వకాలు కొనసాగుతునే ఉన్నాయి.
అధికార పార్టీ అండదండలు, అధికారుల సహకారంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అవసరానికి మించి వే బిల్లులు తీసుకొని రహస్య ప్రదేశాల్లో డంపులు చేస్తున్నారు. రాత్రి సమయంలో ఇతరప్రాంతాలకు తరలిస్తున్నారు. పదుల సంఖ్యలో వేబిల్లులు ఉంటే వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన వే బిల్లులకు, ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ల సంఖ్యకు ఎక్కడా పొంతన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అనుమతుల పేరుమీద ఇసుక అక్రమ రవాణాకు తెరలేపుతున్నట్లు తెలుస్తున్నది. భీమ్గల్ మండలం బడాభీమ్గల్ వాగు నుంచి, ఏర్గట్ల మండలం బట్టాపూర్ పెద్దవా గు నుంచి ఇదే తరహాలో ఇసుక దోపిడీ జరుగుతున్నట్లు సమాచారం. తీసుకునే వే బిల్లులు కొన్ని ఉండగా.. ఇసు క తరలింపు వాహనాలు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. అధికారులకు తెలిసే ఈవ్యవహారం కొనసాగుతున్నదని, అందుకు వారికి కూడా భారీగానే ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జేసీబీతో ఇసుక అక్రమ తవ్వకాలకు అనుమతులిచ్చిన ఏ ఒక్క అధికారిపై కూడా జిల్లా అధికారులు చర్యలు తీసుకోలేదు. బట్టాపూర్ పెద్దవాగులో ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో హైదరాబాద్ నుంచి విజిలెన్స్ అధికారులు వచ్చినా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో ఇసుక దందా కొనసాగుతుండడంతో అధికారులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
బట్టాపూర్ గ్రామం లో వీఆర్ఏ వేబిల్లులపై డేట్, ట్రాక్టర్ నంబర్లు మారుస్తుండండంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.భీమ్గల్, ఏర్గట్ల మండలాల్లో ఇసుక దందాపై విచారణ చేపడితే వాస్తవాలు బయటపడుతాయని ప్రజలు అంటున్నారు. వేబిల్లులు ఇచ్చే తీరుపై కూడా విచారణ జరిపించాలనే డిమాండ్ వినబడుతున్నది. వే బిల్లులపై ఏర్గట్ల తహసీల్దార్ శ్రీలతను వివరణ కోరగా.. సోమవారం 80 వే బిల్లులను జారీ చేశామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వే బిల్లులు జారీ చేస్తున్నామని,దీనికి విరుద్ధంగా ఎవరైనా ఇసుకను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.