మోర్తాడ్, నవంబర్ 22 : అది వాగా, కాలువా, చెరువా అనేది సంబంధం లేదు.. ఇసుక కనిపిస్తే చాలు తోడేసుడే అన్నట్లు బాల్కొండ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నది. రాత్రీ పగలూ తేడా లేదు.
అనుమతులూ అక్కర్లేదు. ఇసుక తవ్వడం, అమ్మడం, ఎవరైనా అడిగితే బెదిరింపులకు పాల్పడడం.. నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న తంతు. మరీ ఇంతగా ఇసుకపై పడ్డారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లతోనే వారు కండ్లు మూసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
భీమ్‌గల్, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో అక్రమ ఇసుక రవాణాకు అడ్డే లేదు. భీమ్‌గల్ మండలంలో కప్పల వాగును ఆనుకుని గోనుగొప్పుల, బెజ్జోరా, సికింద్రాపూర్, బడాభీమ్‌గల్, భీమ్‌గల్ గ్రామాలు, వేల్పూర్ మండలంలో పెద్దవాగును ఆనుకుని రామన్నపేట్, మోతే, వెంకటాపూర్, కుకునూర్, మోర్తాడ్‌లో సుంకెట్, మోర్తాడ్, పాలెం, దొన్కల్, ధర్మోరా, శెట్పల్లి, ఏర్గట్ల మండలంలో తొర్తి, బట్టాపూర్ గ్రామాలు ఉన్నాయి. ఇక, ఏర్గట్ల మండలంలో గోదావరి తీరంలో తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ గ్రామాలు ఉన్నాయి. ఏర్గట్ల మండల కేంద్రానికి వాగు ఆనుకుని ఉంది. ఇదే అవకాశంగా కొందరు అక్రమార్కులు గ్రామ కమిటీలతో మాట్లాడుకుని అక్రమ ఇసుక తవ్వకాలకు తెర లేపారు.
సహజ సంపద దోపిడీకి గురవుతున్నది. సర్కారు ఆదాయానికి గండి పడుతున్నది. ప్రధానంగా బాల్కొండ నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందాకు అడ్డే లేకుండా పోయింది. కొన్ని గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాల కోసం ఏకంగా టెండర్లు నిర్వహిస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు. వాగు, కాలువ, చెరువు.. ఎక్కడ ఇసుక కనబడితే అక్కడ రాబంధుల్లా వాలిపోయి తోడేస్తున్నారు. పొద్దున, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా తిరుగుతున్న ఇసుక వాహనాలు దోపిడీతీరును కళ్లకు కడుతున్నాయి. అనుమతి లేకుండా టన్నుల కొద్దీ ఇసుక అధికారుల కండ్ల ముందు నుంచే తరలిపోతున్నా పట్టనట్టు వ్యవహరిస్తుండడం విషాదం.
మోర్తాడ్ మండలంలోనూ ఇసుక కనిపిస్తే చాలు తోడేస్తున్నారు. ధర్మోరా, పాలెం గ్రామాల్లో పొక్లెయిన్లతో ఇసుకను తోడేశారు. అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈగ్రామాల్లో ప్రస్తుతం అక్రమ రవాణా ఆగింది. వడ్యాట్‌లో ఉన్న ఇసుకనంతా తోడేశారు. ఇక మోర్తాడ్ మొండి వాగుపై కొందరి కన్నుపడింది. పొక్లెయిన్లు పెట్టి అక్రమంగా తరలిస్తున్నారు. పోలీస్‌స్టేషన్ సమీపం నుంచే ఇసుకను తోడేస్తున్నా అడిగే వారుండరు.
మండలంలో ఇసుకను ఎక్కడికెళ్లి తీసుకెళ్లినా గ్రామ కమిటీలకు రూ.1800-రూ.2 వేలు చెల్లించాల్సిందే. ఇక, సుంకెట్‌లో ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ఇసుక పాయింట్లోనూ అనేక అక్రమాలు జరుగుతున్నాయి. సమయం ముగిసిన తర్వాత కూడా ఇసుక తవ్వడం సాధారణమై పోయింది. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు ట్రాక్టర్లను నడుపుతున్నారు. ఇసుక తరలించే వాహనాలకు సరైన రిజిస్ట్రేషన్ పత్రాలు ఉండట్లేదు. ఇటీవల మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఎనిమిది ట్రాక్టర్లను పట్టుకుని ఫైన్ వేశారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అక్రమంగా ఇసుక రవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. లారీల్లో తరలించినా, ఎడ్లబండ్లపై తరలించినా చర్యలు తప్పవు. ఎక్కడైనా ఇసుక డంపులు వేస్తే సీజ్ చేస్తాం. మైనింగ్ అధికారులకు అప్పజెప్పి అధిక జరిమానా విధించేలా చూస్తాం.
– షబ్బీర్, తహసీల్దార్, భీమ్‌గల్
భీమ్‌గల్ మండలంలోనూ అక్రమ దందాకు అడ్డే లేదు. పొక్లెయిన్లు పెట్టి తోడేయ్యడం ఒక ఎత్తయితే, ఎడ్లబండ్లపై తీసుకెళ్లి డంప్ చేసి అమ్ముకోవడం మరో ఎత్తు. బడాభీమ్‌గల్, భీమ్‌గల్ గ్రామాల్లో ఇసుక రవాణాకు ప్రభుత్వ అనుమతి ఉండగా, బెజ్జోరాలో మాత్రం అనుమతి లేదు. కానీ, ఈ గ్రామంలో అక్రమంగా రెండు ఇసుక పాయింట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పాయింట్ వద్ద వంద రోజులు తవ్వుకునేందుకు రూ.7.50 లక్షల చొప్పున ఒప్పందం కుదిరినట్లు తెలిసింది.
బెజ్జోరా నుంచి పొక్లెయిన్లతో ఇసుకను తోడేస్తున్నా అధికారులు మాత్రం కిమ్మనడం లేదు. అనుమతి ఉన్న భీమ్‌గల్, బడాభీమ్‌గల్ ఇసుక పాయింట్ల నుంచి ఒకే వే బిల్లుపై రెండు మూడు సార్లు ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. భీమ్‌గల్‌లో అయితే ఎడ్లబండ్లపై ఇసుకను తరలించి ఇతరులకు విక్రయించుకుంటారు. వీరికి వేబిల్లులు కూడా అవసరం లేదు. ఇలా అమ్ముకున్న ఇసుకను రాత్రుల్లో లారీల్లో తరలించి ఒక్కో లారీ రూ.45 వేల నుంచి రూ.60 వేల వరకు పట్టణాల్లో విక్రయించుకుంటున్నారు. దీనిపై స్థానికులు కొందరు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయింది.