మోర్తాడ్, మార్చి 22: బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతున్నది. అధికారపార్టీ నాయకులే ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతుండడం అందుకు అధికారులు వత్తాసు పలుకుతుండడం పరిపాటిగా మారింది. భీమ్గల్, మోర్తాడ్, ఏర్గట్ల, మెండోరా మండలాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాపై నమస్తే తెలంగాణ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో అక్రమార్కులు రూటు మార్చుకున్నారు. వేబిల్లుల పేరిట అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
ఏర్గట్ల మండలం బట్టాపూర్ శివారులో ఇసుక తవ్వకాల కోసం ట్రాక్టర్కు రూ.50వేలు గ్రామ కమిటీకి చెల్లించాల్సిందే.అయితే ఉదయం 6 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే తవ్వకాలు చేపట్టాలనే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఒప్పందానికి విరుద్ధంగా సా యంత్రం 6 గంటల తర్వాత ఇసుక తవ్వకాలు చేపట్టారు.
దీంతో గ్రామకమిటీ శనివారం సమావేశమై ఇసుకను తరలించిన వారికి రూ.3.50లక్షల జరిమానా విధించినట్లు తెలిసింది. ఇసుకను తీసుకెళ్లాలనుకుంటే వీడీసీకి తప్పనిసరిగా డబ్బులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. గాండ్లపేట్ పెద్దవాగులో నూ ఇలాగే జరిగింది. గాండ్లపేట్ పెద్దవాగు నుంచి ఇసు క అక్రమ తవ్వకాలు చేపట్టి మోర్తాడ్ శివారులోని వాగులోకి వెళ్లడంతో మోర్తాడ్ గ్రామస్తులు రూ.5లక్షల జరిమానా విధించారు. అధికార పార్టీ నాయకులు వేబిల్లుల పేరిట ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. వెల్కటూర్ గ్రామంలో కూడా ట్రాక్టర్కు రూ.50 వేలు చెల్లిస్తున్నారు. బట్టాపూర్లో అమలుచేస్తున్న ఒప్పందాన్నే ఇక్కడ కూడా కొనసాగిస్తుండడం గమనార్హం.