మంజీరా పరీవాహక ప్రాంతంలో మారీచులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. నిత్యం వందలాది ట్రిప్పుల ఇసుకను తరలించుకు పోతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులను మచ్చిక చేసుకుని మంజీరా నదిలో ఇసుకను కొల్లగొడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసుల కళ్ల ముందు నుంచే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోక పోవడమే అందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.
బిచ్కుంద, ఫిబ్రవరి 8: బిచ్కుంద మండలంలోని ఖత్గావ్, హస్గుల్, పుల్కల్ గ్రామాల మంజీర పరీవాహక ప్రాంతాల నుంచి విచ్చలవిడిగా ఇసుకను కొల్లగొడుతున్నారు. కొంత మంది ఇసుకాసురులు బిచ్కుంద మండల కేంద్రంతో పాటు పిట్లం, పెద్దకొడప్గల్, జుక్కల్ మండలాలకు పెద్ద ఎత్తున ఇసుక సరఫరా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. జన సంచారం తక్కువగా ఉండే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నది. హస్గుల్, శెట్లుర్, పుల్కల్ గ్రామాల్లో కొందరు ముఠాగా ఏర్పడ్డారు. పరీవాహక ప్రాంతంలో భారీగా పోగైన ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి కొన్ని ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రికి రాత్రే టిప్పర్ల ద్వారా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం వేసేందుకు సబ్ కలెక్టర్ కిరణ్మయి అర్ధరాత్రి నిఘా పెట్టేందుకు వీఆర్ఏలతో నిఘా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అక్రమ రవాణా ఆగడం లేదు. ఒక్కో గ్రామంలో సుమారు 40 నుంచి 50 ట్రాక్టర్లు ఉన్నాయి. వాటి ద్వారా అర్ధరాత్రి సమయంలో ఇసుకను తరలించుకు పోతున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.4-5వేలు, టిప్పర్‌కు రూ.65 వేల నుంచి రూ.70 వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
గ్రామాల్లో ముఠాలుగా ఏర్పడిన ఇసుకాసురులు అక్రమ తవ్వకాలు, రవాణాకు అడ్డు పడకుండా అధికారులను ‘మేనేజ్’ చేస్తున్నారు. మామూళ్లతో రెవెన్యూ, పోలీసు అధికారులను మచ్చిక చేసుకుని తమ దందాకు అడ్డు లేకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎవరైనా ఇసుక దందాపై ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు, పోలీసులు అక్రమార్కులకు దగ్గరుండి సాయం చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు ఇసుక ట్రాక్టర్ల ముందర కాపలాగా వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని కోరుతున్నారు.
మంజీర నదిని చెరబట్టి ఇసుకను తోడేస్తున్న వారిని అడ్డుకోవాల్సిన యంత్రాంగం చేష్టలుడిగి చూస్తున్నది. నిరంతర నిఘా, తరచూ సోదాలు చేపట్టాల్సిన పోలీసు, రెవెన్యూ అధికారులు వాటిని మరిచి పోయారు. ఎప్పుడైనా పత్రికల్లో వార్తలు వస్తే మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు. ఒకటి, అరా ట్రాక్టర్‌ను పట్టుకుని, చిన్నమొత్తంలో జరిమానా విధించి, వాహనాలను వదిలేస్తున్నారని చెబుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటే తప్పితే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడదని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇసుక దందాను నియంత్రించాలని కోరుతున్నారు.
బాన్సువాడ డివిజన్లోని మంజీ ర పరీవాహక ప్రాంతం లేదా వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలించుకు పోతుంటే మాకు సమాచారం ఇవ్వాలి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. అక్రమంగా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అర్ధరాత్రి వేళ ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం లేదు.
– కిరణ్మయి, బాన్సువాడ సబ్ కలెక్టర్