ఏర్గట్ల/ మోర్తాడ్, ఫిబ్రవరి 21: ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపులేకుండా పోయింది. ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని సీపీ హెచ్చరించినా ఫలితంలేకుండా పోతున్నది. ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామ శివారులోని పెద్దవాగులో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే గ్రామ కమిటీకి ట్రాక్టర్‌కు రూ.50వేల చొప్పున 34 ట్రాక్టర్లకు రూ.17లక్షలు చెల్లించిన ఇసుకాసురులు..మేమెవరి మాట వినం అన్నట్లుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. కూలీలతో కాకుండా పొక్లెయిన్‌తో కూడా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. శుక్రవారం ఉదయం 6గంటల నుంచే పెద్దవాగులో ఇసుక తవ్వకాలు చేపట్టడం గమనార్హం.
తెల్లవారుజామునుంచి సాయంత్రం వరకు ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ట్రిప్పు కు రూ.200 ఎవరి కోసం వసూలు చేస్తున్నారని, అధికారులకు మామూళ్లు చెల్లించేందుకేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కమ్మర్‌పల్లిలో వేబిల్లులు లేకుండా వచ్చిన ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు నిలిపివేయగా, వెంటనే అధికార పార్టీకి చెందిన నాయకులు ఫోన్లు చేయడంతో వదిలేసినట్లు సమాచారం.