నిజామాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతున్నది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇదంతా కొనసాగడం గమనార్హం. పోలీసులు, రెవెన్యూ అధికారుల పరోక్ష మద్దతుతో పెద్ద ఎత్తున ఇసుక దందా కొనసాగుతోంది. బాల్కొండ నియోజకవర్గంలో ఏ వాగునూ వదిలి పెట్టకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు చేస్తుండడంతో భూగర్భ జలాలకు పెను ప్రమాదం ఏర్పడింది. భీమ్‌గల్‌లో ఈ తరహాలోనే ఇసుకను తవ్వుతున్న అక్రమార్కులను యంత్రాంగం అడ్డగించడం లేదు. పైగా అడ్డు తగిలిన వారిపై దాడులకు తెగబడుతూ వ్యవస్థకే ఇసుకాసురులు సవాల్‌గా నిలుస్తున్నారు.
ఇప్పుడు తాజాగా వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్‌లోనూ ఇదే రకమైన దందా చేయడానికి కొంత మంది వ్యక్తులు సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి ఇసుక ట్రాక్టర్లతో పెద్దవాగులో మోహరించారు. కొంత మంది నాయకుల మద్దతుతో వాహనాలను తీసుకుని వాగులోకి దిగి ఇసుక తరలింపునకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన కొంత మంది నేతల సహకారంతో వాగులో నుంచి ఇసుకను తవ్వుతుండడంతో భూగర్భ జలాలకు పెను ప్రమాదం పొంచి ఉన్నదని స్థానికులు వాపోతున్నారు. వీడీసీ అనుమతితో ఇసుకాసురులు ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతున్నప్పటికీ అడ్డుకునే వారు కరువయ్యారు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు స్థానికులు సమాచారం అందిస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేకుండా పోయిందని వాపోతున్నారు. అడ్డు తగిలితే బెదిరింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వేల్పూర్ మండలం వెంకటాపూర్‌లో వే బిల్లులు లేకుండానే ఇసుకను తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. వే బిల్లుల ద్వారా ఇసుక తరలిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో జీరో దందా వల్ల సర్కారుకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతున్నది. వాగులో ఇసుక తరలింపునకు కొన్ని పరిమితులు, నిబంధనలు ఉన్నాయి. వీటిని ఏ ఒక్కరూ పాటించడం లేదు. వే బిల్లులకు మంగళం పాడడంతో స్థానిక గ్రామ పంచాయతీకి రావాల్సిన ఆదాయం కూడా పడి పోతుంది.
కొంత మందికే ఈ ఆదాయం లాభం చేకూరుతోంది. అక్రమార్కులను నిలువరించి ఇసుక వ్యాపారాన్ని అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే భూగర్భ జలాలు తగ్గిపోయి వచ్చే యాసంగి సీజన్లో పంటల సాగుకు తీవ్రంగా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫోన్లు చేసినా పట్టించుకోవడం లేదని స్థానిక జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో వారందరికీ ప్రత్యేకంగా వాటాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాల వాసులు కోరుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక అక్రమ వ్యాపారం మచ్చుకూ జరగలేదని, ఇప్పుడైతే అడ్డూ అదుపు లేకుండా చేస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య ఇసుక దోపిడీలో అంతర్యుద్ధం జరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవి చూసిన నాయకుడితోపాటు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన మరో నాయకుడికి మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. ఇసుక తరలింపులోనూ నియోజకవర్గంలో ఒకరిపై మరొకరు పెత్తనం సాగిస్తుండడంతో ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందని కింది స్థాయిలో శ్రేణులు రుసరుసమంటున్నారు. ఇందులో జోక్యం చేసుకునేందుకు రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికార యంత్రాంగం ఎవరూ ధైర్యం చేయడం లేదు.
అధికార పార్టీ నేతల మధ్యలోకి వెళ్లి నిబంధనలను అమలు చేయడం తమతో కాదన్నట్లుగా అధికారులు చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తోంది. మొత్తానికి బాల్కొండ నియోజకవర్గంలో కీలక కాంగ్రెస్ నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు అన్నది ఇసుక అక్రమ వ్యాపారం విషయంలో సాగుతుండడం వివాదాస్పదంగా మారింది.