ఖలీల్‌వాడి, ఆగస్టు 11: విద్యాశాఖలో అక్రమ డిప్యూటేషన్ల వ్యవహారం నడుస్తున్నది. విద్యార్థులు ఎక్కువగా.. ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలలకు టీచర్లను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అదునుగా భావించిన విద్యాశాఖ అధికారులు అక్రమ డిప్యూటేషన్లకు తెరలేపారు. నిజామాబాద్ జిల్లాలో ఈ అక్రమ డిప్యూటేషన్ల వ్యవస్థ జోరుగా నడుస్తున్నది. విద్యాశాఖ అధికారుల తీరు పలువురు ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమై 55 రోజులు గడుస్తున్నా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ఎవరికోసం విద్యాశాఖ పని చేస్తున్నదో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది.
అవసరం లేని పాఠశాలలకు ఉపాధ్యాయులను అడ్డదారిలో సర్దుబాటు చేయడం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు మండి పడుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి రాష్ట్రస్థాయిలో డిప్యూటేషన్ ఆర్డర్లలో ఇక్కడ అవసరం లేకున్నా టీచర్లను సర్దుబాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. మండలాలు, రెవెన్యూ డివిజన్లు దాటి డిప్యూటేషన్లు వేయడం విద్యాశాఖ అధికారుల అలసత్వాన్ని స్పష్టం చేస్తున్నది. అడ్డదారిలో డిప్యూటేషన్లు ఇవ్వడంలో విద్యాశాఖ అధికారులను ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభావం చేశారనే ఆరోపణలూ ఉన్నాయి.
మండల పరిధిలోనే సర్దుబాటు చేయాలని ఆదేశాలు ఇచ్చినా.. ఇటీవల నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ఇచ్చిన సర్దుబాటు ఆదేశాలు తీవ్ర విమర్శలకు తెరలేపుతున్నాయి. కమ్మర్పల్లి మండలం ఇనాయత్‌నగర్ ఎంపీయూపీఎస్ నుంచి జిల్లా కేంద్రానికి, కోనాసముందర్ జడ్పీహెచ్ఎస్ నుంచి చిన్నాపూర్కు డిప్యూటేషన్ వేయడం విమర్శలకు దారి తీసింది. మండలాల పరిధిలోనే సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జిల్లా విద్యాశాఖాధికారులు వారికి అనుకూలంగా మార్చుకుని వంద కిలోమీటర్లపైనే దూరం ఉన్న ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు డిప్యూటేషన్ వేయడంపై ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో సుమారు 200 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. సీనియారిటీని పట్టించుకోకుండా, అవసరం లేకుండానే డిప్యూటేషన్లు వేశారమే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్న టీచర్లు కొందరు ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ నాయకులతో పైరవీలు చేయించుకుని జిల్లా కేంద్రానికి దగ్గరగా డిప్యూటేషన్లు వేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాలైన కమ్మర్పల్లి, మోర్తాడ్, వేల్పూర్, సిరికొండ తదితర మండలాల నుంచి జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న మండలాలకు డిప్యూటేషన్లు వేయించుకున్నట్లు విమర్శలున్నాయి. ఇతర జిల్లాల నుంచి రాష్ట్రస్థాయి అధికారులు, నాయకుల ఒత్తిళ్లతో జిల్లాకు అవసరం లేని చోట కూడా ఉపాధ్యాయులను డిప్యూటేషన్ వేస్తున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు ఉన్నా రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాలతో డిప్యూటేషన్‌పై వస్తున్న వారిని జిల్లా విద్యాశాఖాధికారులు సర్దుబాటు చేయడం గమనార్హం.