నిజామాబాద్, జూన్ 29, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారులకు కళ్లు లేని కబోదిలా మారిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు విద్యా సంస్థలు పని చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. కనీసం ఆకస్మిక తనిఖీలు చేపట్టడం లేదు. కార్పొరేట్ సంస్థలకు దాసోహం అన్న తీరుగా కొంత మంది మండల, జిల్లా స్థాయి అధికారులు వ్యవహరిస్తుండడం విడ్డూరంగా మారింది. రాతపూర్వకంగా ప్రైవేటు విద్యాసంస్థలపై ఫిర్యాదులు అందుతున్నప్పటికీ కాలు బయట పెట్టి విచారణ చేయడం లేదు. అనధికారిక వ్యక్తుల చెప్పు చేతుల్లో పని చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నట్లుగా తేటతెల్లం అవుతోంది.
అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ జనాలను మోసం చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు నుంచే ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నప్పటికీ ముకుతాడు వేయలేదు. ఫీజుల పేరుతో దోపిడీ విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారు. వసతులు సరిగా లేకపోయినప్పటికీ ఇష్టారీతిన ఫీజులు నిర్ణయించారు. స్పెషల్ క్లాస్‌లు, ఆన్లైన్ తరగతుల పేరిట మొదట్లోనే ఫీజులు దండుకుంటున్నారు. పుస్తకాలు, దుస్తులు పేరుతో ఫక్తూ బిజినెస్ చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలు ఈ వ్యవహారాలపై ఫిర్యాదులు ఇచ్చాయి. అవన్నీ బుట్టదాఖలు చేస్తూ యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోన్న విద్యాసంస్థలకే వత్తాసు పలుకుతుండటం చర్చనీయాంశం అవుతోంది. బహిరంగంగానే ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే విద్యాశాఖ స్పందించకపోవడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని దోపిడీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పేద ప్రజలకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఆకాశాన్ని తాకిన నిత్యావసరాలతో బతకడమే కష్టంగా మారింది. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించడమే తలకు మించిన భారంగా మారింది. ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లలను చదివించాలనే ఆశ ఉన్నప్పటికీ ప్రజాపాలనలో పరిస్థితులు తారుమారు అయ్యాయి. బడుల్లో వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత, సమయానికి రాని టీచర్లు, విద్యాశాఖ నిర్లీప్తతతో అటువైపు సామాన్యులు వెళ్లాలంటే మొఖం చాటేస్తున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు వల పన్ని సామాన్యులను తమ బుట్టలో పడేస్తున్నారు. సర్కార్ బడులపై నమ్మకం లేక ప్రైవేటు వైపు చూస్తున్నారు. తమ పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించాలనే ఆశతో ప్రైవేటు స్కూళ్లలో జాయిన్ చేస్తే అడుగడుగునా పేద, మధ్య తరగతి కుటుంబాలకు గట్టి దెబ్బనే తగులుతోంది.
రూ.లక్షకు చేరువైన ఫీజులకు తోడుగా రవాణా పేరుతో బస్సు ఛార్జీ, పుస్తకాల పేరుతో రూ.వేలల్లో వసూళ్లు మరింత కుంగ దీస్తోంది. అప్పో సొప్పో చేసి పిల్లలను చదివిద్దామనుకున్న వారికి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఊహించని షాక్‌లు ఎదురవుతున్నాయి. అక్రమ వ్యాపారంతో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఇష్టారాజ్యాంగా ప్రవర్తిస్తుంటే విద్యాశాఖ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. మామూళ్ల మత్తులో మునిగి తేలుతుండటమే ఇందుకు కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే అనేక సంఘాలు ఆందోళనలు చేశాయి. విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దల్లో స్పందన లేదు. ఈ విషయంపై డీఈవో అశోక్‌ను వివరణ కోసం సంప్రదించగా… ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
నిజామాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కార్పొరేట్ విద్యా సంస్థలు అరంగేట్రం చేశాయి. పోటాపోటీగా వివిధ స్కూల్ యాజమాన్యాలు అడ్మిషన్లు స్వీకరిస్తున్నాయి. ఫీజుల్లో రాయితీ పేరు చెప్పి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి అతంతం మాత్రంగానే ఉన్న వారిని సైతం వదలడం లేదు. ఫోన్లు చేసి ఒత్తిడికి గురి చేసి అడ్మిషన్లు స్వీకరించేలా వేధిస్తున్నారు. సర్కార్ బడికి వెళ్లాలనే ఆలోచనను ప్రైవేటు వ్యక్తులు మర్చేస్తున్నారు. తీరా స్కూల్లో చేరిన తర్వాత రశీదు లేకుండా ఇచ్చే ఫీజులు, రశీదు ఇచ్చే ఫీజులు కట్టలేక ఆరంభంలోనే ఆగమాగం కావాల్సి వస్తోంది. భిన్నమైన ఫీజులు తెరపైకి తీసుకు వచ్చి వసూళ్లు చేస్తున్నారు. కొందరైతే అడ్మిషన్ ఫీజు పేరుతో రూ.వేలల్లో డబ్బులు గుంజుతున్నారు. డొనేషన్లను ఇబ్బడిముబ్బడిగా నగదు రూపంలో స్వీకరిస్తున్నారు.
జూన్ 12న కొన్ని స్కూళ్లు, జూన్ 17న మరికొన్ని స్కూళ్లు మొదలయ్యాయో లేవో దుస్తులు, పుస్తకాల పేరుతో మరోరకమైన దోపిడీ షురూ అయ్యింది. విద్యార్థి సంఘాల దాడులు, నిరసన కార్యక్రమాలకు భయపడి కొంత మంది గుట్టు చప్పుడు కాకుండా బుక్స్ అమ్ముతున్నారు. 1వ తరగతికి సుమారుగా గరిష్టంగా రూ.5వేలు వరకు వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. కార్పొరేట్ స్కూళ్ల నిర్వాహకులు దొంగ చాటున అడ్రస్‌లు పెట్టి సదరు ప్రాంతంలోనే పుస్తకాలు కొనాలని తల్లిదండ్రులను ఉసిగొల్పుతున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న స్కూల్ యాజమాన్యాలైతే యథేచ్ఛగా స్కూళ్లనే బుక్ స్టాళ్లుగా మార్చేశారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల బుక్కులకు సుమారుగా రూ.15వేలు దాటుతుంది.