నమస్తే యంత్రాంగం, మార్చి 24: డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తున్నది. శాంతియుత నిరసనలను సైతం పోలీసులను ఉసిగొల్పి అణచి వేస్తున్నది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్వీ అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పోలీసులు మంగళవారం ఎక్కడికక్కడ బీఆర్ఎస్వీ నేతలను అరెస్టు చేశారు. బీఆర్ఎస్వీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిలాష్‌రెడ్డిని నందిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు ఆర్మూర్లోనూ మీరా శ్రావణ్, అగ్గు క్రాంతి, షాహిద్ అలీలను పోలీసులు అరెస్టు చేసి, ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఎల్లారెడ్డిలో యువ నేత అట్కారి బబ్లూను అదుపులోకి తీసుకున్నారు. బాన్సువాడలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జుబేర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ మోసగించిందని మండిపడ్డారు. డిమాండ్ల కోసం విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసులతో ఆపలేరన్నారు. నాగిరెడ్డిపేట, కామారెడ్డిలోనూ అక్రమ నిర్బంధాలు కొనసాగాయి. బీఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్, బీఆర్ఎస్వీ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు శీను నాయక్, పృథ్విరాజ్లను అరెస్టు చేశారు.