నవీపేట, అక్టోబర్ 4: ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల ఒత్తిడితోనే అధికారులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్‌ఫ్లోకు అనుగుణంగా నీటిని విడుదల చేయలేదని, దీంతో గోదావరి బ్యాక్ వాటర్‌లో వేలాది ఎకరాల పంట మునిగి నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ నాయకుల బృందం ఆరోపించింది.
నవీపేట మండలంలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో నీట మునిగి దెబ్బతిన్న పంటలను జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, బీఆర్ఎస్ నవీపేట మండల అధ్యక్షుడు వి.నర్సింగ్‌రావు ఇతర నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు. ముంపునకు గురైన కోస్లీ, యంచ, నందిగామ, బినోలా, నాళేశ్వర్, తుంగిని, నిజాంపూర్, మిట్టాపూర్ తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమాక్ర, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వార్థ రాజకీయాలతో ఎస్సారెస్పీలోకి వచ్చిన వరదను 42గేట్లు ఎత్తి దిగువకు వదలకుండా ఒత్తిడి తెచ్చారన్నారు. గేట్లను పూర్తిగా ఎత్తితే ఖమ్మం జిల్లాలో పంటలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నదని, అధికారులు నీటిని వదలకుండా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నవీపేట మండలంలో పంటలకు తీవ్రనష్టం జరిగినా.. అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
ఆయా గ్రామాల్లో వరదలో దెబ్బతిన్న పంటలను రైతులు నాయకులకు చూపించి, తమ గోడు వెల్లబోసుకున్నారు. వరద నీటిలో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.50వేల పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు న్యాలకంటి అబ్బన్న, అల్లం రమేశ్, లోకం నర్సయ్య, రాజేశ్వర్, గైని మోహన్, గంగాధర్, భూమయ్య, లాలు, కిషన్‌రావు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరి వరదలతో పెద్దఎత్తున పంట నష్టం జరుగుతున్నా.. అధికార యంత్రాగం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇటీవల వచ్చిన వరదతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగి తే.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేయలేదని, కూ చున్న దగ్గరే లెక్కలు వేసి, ప్రభుత్వానికి నివేదిక పంపించారని మండిపడ్డారు.
కోస్లీ, యంచ, మిట్టాపూర్, అల్జాపూర్, నందిగామ, నిజాంపూర్, తుంగిని, నాళేశ్వర్ గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగితే.. అధికారులు మాత్రం వందల ఎకరాల్లోనే సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారన్నారు. సమగ్ర సర్వే చేపట్టి, నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని రైతులు వంజరి రాజేశ్వర్, జగన్, భూమయ్య, లాలయ్య, హరీశ్, విఠల్, గంగాధర్ హెచ్చరించారు.