మోర్తాడ్, మే 7: నిజామాబాద్ జిల్లాలో వందశాతం రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే సీఎంతోపాటు పీసీసీ చీఫ్ తమ పదవులకు రాజీనామా చేస్తారా అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి.. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సవాల్ విసిరారు. కేటీఆర్ స్థాయి గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చరిత్ర తెలుసుకోవాలని సూచించారు.
కేటీఆర్‌పై పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వేముల గురువారం ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్ అంతర్జాతీయ స్థాయి నాయకుడని, ఆయన స్థాయి గురించి మాట్లాడే అర్హత మహేశ్‌కుమార్‌గౌడ్‌కు లేదని పేర్కొన్నారు. రుణమాఫీ పై మహేశ్‌కుమార్‌గౌడ్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ పుట్టుక గురించి బీజేపీ నాయకులు మాట్లాడితే అందరికన్నా ముందుగా స్పందించి ఖండించిన వ్యక్తి కేసీఆర్ అని, అది ఆయన సంస్కారమని గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ నేతలు కుసంస్కారమైన భాషను వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ స్థాయి గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కేటీఆర్ అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చిన నాయకుడని, ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలను కల్పించి హైదరాబాద్‌ను గ్లోబల్‌సిటీగా నిలబెట్టిన ఘనత ఆయనదని కొనియాడారు. కేటీఆర్ ప్రజల చేత ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడని, ఒక్కసారి కూడా నేరుగా ప్రజలతో గెలవని మహేశ్‌కుమార్‌గౌడ్ కేటీఆర్ స్థాయి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వేముల సూచించారు.