నిజామాబాద్ : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అబద్దాలతో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు రాదని, అందుకు కర్నాటక రాష్ట్రమే నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha) ఆరోపించారు. శుక్రవారం నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో వేర్వేరుగా నిర్వహించిన రోడ్ షో లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజీరెడ్డి గోవర్ధన్ తో కలిసి కవిత పాల్గొన్నారు.
ఆమె మాట్లాడుతూ కర్నాటక (Karnataka) రాష్ట్రంలో వంద అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే ముఖ్యమంత్రి మారుతారంటూ వాళ్లలో వాళ్లే పంచాయితీ పెట్టుకుంటున్నారని విమర్శించారు. కర్నాటకలో 9 గంటల పాటు కరెంటు ఇస్తామని మూడు గంటలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉట్టి మాటలు మాట్లాడే వాళ్లను నమ్ముతారా, పదేళ్లుగా చెప్పింది చేసినటువంటి సీఎం కేసీఆర్(CM KCR) ను నమ్ముతారా అన్నది ఆలోచించాలని కోరారు.
ఓట్లేసేటప్పుడు ఆగం కావద్దన్నారు. ఓటు వేయడానికి వెళ్లే ముందు ఇంట్లో లైటు వేయాలని, బుగ్గ వెలిగితే కారు గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతన్నలు అనుభవించిన దుఖాన్ని మరిచిపోద్దని చెప్పారు. మతకల్లోలాలు లేని తెలంగాణ సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని, కేసీఆర్ అధికారంలో ఉంటే భవిష్యత్తులోనూ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని ధీమాను వ్యక్తం చేశారు.
60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ కు షాదీ ముబారక్ వంటి ఆలోచన చేయలేదని, 24 గంటల విద్యుత్తు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. అన్ని రకాల పెన్షన్లను రూ. 5 వేలకు పెంచాలని, కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని వివరించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన అన్ని నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయని విమర్శించారు. ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్లకు ఇల్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షలు అందిస్తున్నామని వివరించారు. నిజామాబాద్ లో ఐటీ హబ్ ఏర్పాటు చేయడం వల్ల చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయని, తాము నిర్వహించిన జాబ్ మేళాల వల్ల 3500 మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు.