Husband Suicide | ఎల్లారెడ్డి రూరల్ : భార్య అక్రమ సంబంధానికి భర్త బలయ్యాడు. ఇంటికి సమీపంలో ఉన్న కోళ్ల ఫారం వద్ద భర్త ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మ్యాతరి సతీష్ (42) కు 17 ఏండ్ల క్రితం గౌరారం గ్రామానికి చెందిన అనితతో పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సతీష్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సతీశ్‌కు ఎల్లారెడ్డి పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం రావడంతో మార్చి 1వ తేదీ నాడు గృహప్రవేశం చేసుకొని భార్య పిల్లలతో అక్కడే ఉంటున్నాడు.
అయితే సతీష్ భార్య అనిత వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఇట్టి విషయంలో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మార్చి 3వ తేదీ రాత్రి సమయంలో భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త.. ఇంటి సమీపంలో ఉన్న కోళ్ల ఫారం వద్ద ఉరేసుకున్నాడు. మంగళవారం ఉదయం సతీష్ మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు.. కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుని తల్లి మ్యాతరి పద్మ తన కుమారుడి మృతిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.